రైతుల వెన్ను విరుస్తున్న ప్రభుత్వం
యూరియ కోసం యాప్ అంటూ రైతులను ఆగం చేస్తున్నారు
ప్రభుత్వం మెడలు వంచి రైతులకు మేలు చేసేలా చేస్తాం
టీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి బోడ జనార్ధన్
(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్):
యూరియా కూడా సరిగ్గా అందించకుండా రైతులను కాంగ్రెస్ సర్కార్ ఆగం చేస్తున్నదని టీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి బోడ జనార్థన్ మండిపడ్డారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణసేన కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు, పండించిన పంట కొనుగోలు చేయలేని, యూరియా అందించని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం పొగుడుతూ లేఖ రాయటాన్ని ఆయన తప్పు పట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు.
యూరియా యాప్ ను రద్దు చేయాలి
రైతులకు కనీసం యూరియా కూడా సరిగ్గా సప్లయ్ చేయలేని చేతగాని ప్రభుత్వమిదని బోడ జనార్థన్ విమర్శించారు. ఉదయం అరగంట, మధ్యాహ్నం పావుగంట మాత్రమే యాప్ పనిచేస్తున్నదని ఆ తర్వాత నో స్టాక్ అని చూపిస్తున్నదన్నారు. ఫోన్లు లేని, సిగ్నల్ లేని ప్రాంతంలో ఉండే రైతుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ యాప్ కారణంగా రైతులు ఇబ్బంది పడటం తప్ప వారికి ఏ విధంగా మేలు జరగటం లేదన్నారు. బ్లాక్ మార్కెట్ ను కంట్రోల్ చేయాలనుకుంటే ఎన్నో ఇతర మార్గాలు ఉన్నాయని సూచించారు. కానీ రైతులు మాత్రమే మీకు కనిపిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. వెంటనే యాప్ ను రద్దు చేసి పాస్ బుక్కుల ఆధారంగా యూరియా సప్లయ్ చేయాలని సూచించారు. గతేడాది కూడా యూరియా ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెట్టారని ఇప్పుడు నాట్లు వేసుకునే సమయం వచ్చినప్పటికీ ఇప్పటికీ యూరియా సప్లయ్ చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
9 లక్షల ఎకరాల పంటను రైతులు కాల్చేశారు
రేవంత్ సర్కార్ చేతగాని తనం కారణంగా రైతులు 9 లక్షల ఎకరాల పంటను కాల్చేశారని బోడ జనార్థన్ చెప్పారు. రైతులు పండించిన మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తామని గొప్పలు చెప్పి…ఇప్పుడు పంట కొనుగోలు చేస్తలేరన్నారు. దీని కారణంగా రైతులు 9 లక్షల ఎకరాల పంటను కాల్చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా అన్ని రకాల వరి ధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పి ఆ తర్వాత సన్నాలకే అని మాట మార్చారని మండిపడ్డారు. ఇప్పుడు వాటిలో కూడా 7 రకాలే ఇస్తామంటూ మళ్లీ మోసానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను మోసం చేస్తూ వారి వెన్ను విరుస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని కేంద్రం ప్రశంసించటం విడ్డూరంగా ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అన్యాయం జరిగనివ్వమని బోడ జనార్థన్ చెప్పారు. రైతుల పక్షాన పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు.








