తెలంగాణను అడ్డుకున్న అనకొండలతో గుంటనక్క దోస్తీ
రాష్ట్రాన్ని వ్యతిరేకించిన కార్పొరేట్ శక్తులకు పాలు పోసి పెంచుతున్న బీఆర్ఎస్ గుంటనక్క
తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతుంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ గప్ చుప్ అయ్యాయి
ఇడుపు కాయితం అర్థం పవన్ కల్యాణ్ ను అడిగితే బాగా చెబుతాడు
ఉద్యమంలో అవాకులు, చేవాకులు పేలిన వాళ్లే మళ్లీ తెలంగాణపై కుట్ర చేస్తున్నారు
తెలంగాణ కోసం పోరాటం చేసేది ఒక్క టీఆర్ఎస్ మాత్రమే
-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
(తెలంగాణ రక్షణసేన, ఉప్పల్)
తెలంగాణ ఉద్యమకాలంలో అవాకులు, చవాకులు పేలిన వాళ్లంతా మళ్లీ ఇప్పుడు పేట్రేగిపోతున్నారని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఒకరి భాషను ఒకరు గౌరవించుకోవాలి కానీ మా భాషను అవమానిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
ఉప్పల్ లో ఆదివారం టీఆర్ఎస్ జెండా ఎగరేసిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఇడుపు కాయితం అనే పేరు ఒక సినిమాకు పెడితే అర్థం కాలేదని ట్రోలింగ్ చేస్తున్నారన్నారు. ఇడుపు కాయితం అంటే అర్థం కావాలంటే మీ పవన్ కల్యాణ్ ను అడిగితే బాగా తెలుస్తుందన్నారు. ఒకసారి ఇలా అవహేళన చేస్తేనే పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ భాషను అవమానిస్తే కాంగ్రెస్ ఏమీ అనటం లేదని.. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ ఉద్యమంతోనే ఆయనకు సంబంధం లేదని ఎద్దెవా చేశారు. ఇక బీజేపీ అయితే దేశం అంటూ మనల్ని పట్టించుకోవటం లేదన్నారు. తెలంగాణ భాష, యాసలను అవమానిస్తున్నా బీఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడటం లేదు.. పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఎందుకంటే ఆ పార్టీలో ఉండే గుంటనక్క…నారాయణ, చైతన్య విద్యాసంస్థలతో పాల వ్యాపారం చేస్తున్నాడని కవిత ఆరోపించారు. అందుకే ఆ పార్టీ నాయకులు కనీసం మాట్లాడటం లేదన్నారు. నారాయణ, చైతన్య, సహా పెద్ద కార్పొరేట్ స్కూళ్లు, హాస్పిటళ్లలో మదర్ డెయిరీ, ముల్కానూరు, విజయ డెయిరీల నుంచే పాలు కొనాలంటూ ప్రభుత్వం జీవో తేవాలని కవిత డిమాండ్ చేశారు.
తెలంగాణ అస్తిత్వ రక్షణ కోసమే మా పోరు
ఎన్నో రోజుల నుంచి స్కూల్ ఫీజులు తగ్గించాలని కోరుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగ్గించటం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా కార్పొరేట్ స్కూళ్లలో కనీసం కటింగ్, బట్టలు ఉతకటం, ఫర్నీచర్ వంటి వాటికి కూడా తెలంగాణ వాళ్లకు అవకాశం ఇవ్వటం లేదని చెప్పారు. టీచర్లను కూడా 80 శాతం కేరళ, ఆంధ్రా నుంచే తీసుకొస్తున్నారన్నారు. ఇప్పుడు నార్త్ ఇండియా నుంచి వస్తున్న స్కూళ్లలో కూడా బాత్ రూములను కడిగేందుకు కూడా అక్కడి వాళ్లనే తెచ్చుకుంటున్నారని వివరించారు. ఇలాంటి సమయంలో మన హక్కుల కోసం ఒక్క టీఆర్ఎస్ మాత్రమే మాట్లాడుతున్నదని కవిత వెల్లడించారు. తెలంగాణను అడ్డుకునేందుకు ఏ ఆనకొండలు, కార్పొరేట్ శక్తులు ప్రయత్నించాయో వాటికి పాలు పోసి పెంచుతున్నది ఈ గుంటనక్కేనని దుయ్యబట్టారు. ఆంధ్రావాళ్లతో వ్యాపారం చేస్తున్నందుకే బీఆర్ఎస్ వాళ్లు ఏమీ మాట్లాడ్డం లేదని తెలిపారు. ఆ పార్టీకి తెలంగాణతో పేగు బంధం తెగిపోయిందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు, ఉద్యమకారుల కోసం తానే పోరాటం చేస్తానని కవిత వెల్లడించారు. లాఠీలు, రబ్బరు తూటాలు నన్ను దాటుకొని రావాలని చెప్పారు.
ఉద్యమకారుల కోసం భూ పోరాటం
ఉప్పల్ అంటేనే తెలంగాణ ఉద్యమానికి అడ్డా. అలాంటి ప్రాంతంలో ఇవ్వాళ టీఆర్ఎస్ జెండా ఎగురవేసుకోవటం సంతోషంగా ఉందన్నారు. ఉద్యమంలో మనం అనుకున్నవి తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా సాధించుకోలేకపోయామని చెప్పాారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇస్తామన్న 250 గజాల భూమి కోసం జులై 2 న ఉప్పల్ భగాయత్ లో పెద్ద ఎత్తున భూపోరాటం చేస్తున్నామని కవిత తెలిపారు. ఈ పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులంతా పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉద్యమకారులు, మహిళలు, విద్యార్థుల కోసం తెలంగాణ రక్షణసేన పోరాటం చేస్తుందని తెలిపారు. అధికారంలోకి వచ్చాక కచ్చితంగా ఉచిత విద్య, వైద్యం అందిస్తుందని ప్రకటించారు. ఉప్పల్ లో అన్ని డివిజన్లలో టీఆర్ఎస్ పోటీ చేస్తుందని తెలిపారు. భవిష్యత్తులో ఉప్పల్ ఎమ్మెల్యే సీటు కూడా గెలుస్తామని చెప్పారు. ఒక రాజకీయ పార్టీ ఎలా సేవ చేస్తుందో, ప్రజల కోసం ఎట్ల పనిచేస్తుందో తాము చూపిస్తామన్నారు. ఈ కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీల గురించి కూడా మేము పోరాటం చేస్తామన్నారు.








