పీవీ మాకు ఆదర్శం

ఆయన ఆలోచనను భావి తరాలకు అందిస్తాం

-టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

(తెలంగాణ రక్షణసేన, బంజారాహిల్స్)

మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఈ దేశం ప్రపంచంతో పోటీ పడేలా చేశారని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. అలాంటి వారి మేధస్సును గౌరవించకపోవటం కాంగ్రెస్ పార్టీ కుసంస్కారమని విమర్శించారు. పీవీ అభిమానులుగా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని ఎన్నటికీ మేము క్షమించమన్నారు. పీవీ జయంతిని పురస్కరించుకుని బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ  తెలంగాణ స్వాభిమానాన్ని ఢిల్లీలో చాటిన పీవీని ఈ నేల ఎన్నటికీ మరవదన్నారు. పీవీ తెలంగాణ నుంచి ప్రధానిగా వెళ్లి తెలంగాణ స్వాభిమానాన్ని ఢిల్లీలో చాటారన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆయనకు దక్కాల్సిన గౌరవాన్ని ఎనాడూ ఇవ్వలేదన్నారు. తెలంగాణ జాగృతి సంస్థ తరపున తెలంగాణ వైతాళికులు పీవీ జయంతి, వర్థంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. తమకు పీవీ ఎప్పటికీ ఆదర్శప్రాయులేనన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కచ్చితంగా పీవీ అడుగుజాడల్లో నడుస్తామని కవిత స్పష్టం చేశారు. వారి అడుగుజాడల్లో నడవటమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అన్నారు.