జీవో నంబర్ 150 తో నీట్ తెలంగాణ అభ్యర్థులకు అన్యాయం
వెంటనే జీవోను సవరించాలి
ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి
-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
కవితను కలిసి తమ బాధను చెప్పుకున్న నీట్ అభ్యర్థులు, వారి తల్లితండ్రులు
(తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్)
తెలంగాణ ప్రభుత్వం అనాలోచితంగా తెచ్చిన జీవో 150 తో నీట్ అభ్యర్థులు, వారి తల్లితండ్రులు ఆందోళనలో ఉన్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. పేరెంట్లతో కలిసి అభ్యర్థులు శుక్రవారం ఆమెను కలిసి తమ సమస్యను వివరించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ.. అభ్యర్థులు ఇప్పటికే ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. కేవలం నాలుగేళ్లు ఇక్కడ చదివితే చాలు స్థానికులుగా పరిగణించేలా జీవో తేవటం తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేయటమేనని ఆవేదన వ్యక్తం చేశారు. మనం తెలంగాణ తెచ్చుకున్నదే తెలంగాణ భవిష్యత్ తరాలకు న్యాయం కోసమని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని కోరారు. జీవో 150 కారణంగా మెడిసిన్ లో 1600 సీట్లు బయటవాళ్లకు పోయే పరిస్థితి వచ్చిందని కవిత చెప్పారు. తెలంగాణ బిడ్డల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలలో వేరే వాళ్లకు సీట్లు ఇవ్వటం సరికాదన్నారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయటం సాధ్యం కాకపోతే…అనుబంధంగా జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. కనీసం ఏడేళ్ల పాటు తెలంగాణలో చదివిన వారికే స్థానికులుగా అవకాశం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే నీట్ కారణంగా మనం 15 శాతం సీట్లు కోల్పోతున్నామని కవిత తెలిపారు. తెలంగాణ రక్షణసేన తరఫున నీట్ ను తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో మెడికల్ బోర్డు ఉంటేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని సూచించారు. ముఖ్యమంత్రి ఈ విషయంలో వెంటనే స్పందించాలన్నారు. విదేశాల్లో ఉన్నానంటూ పట్టించుకోకపోతే ఊరుకోమన్నారు. ఇది టైమ్ సెన్సిటివ్ మ్యాటరని.. వారం రోజుల్లో నిర్ణయం తీసుకోకపోతే 1500 మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి, అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కవిత డిమాండ్ చేశారు.








