ఫ్రీ కరెంటు ఎత్తివేతకు రేవంత్ కుట్ర
స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రయత్నం పేదలకు శాపం
స్మార్ట్ మీటర్లు పెడితే ఊరుకోం

ప్రభుత్వాన్ని హెచ్చరించిన తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత

(బంజారాహిల్స్, హైదరాబాద్)

విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలన్న తెలంగాణ ప్రభుత్వ ఆలోచన ఇక్కడి పేద, మధ్యతరగతి ప్రజలకు తీవ్ర నష్టం చేస్తుందని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త పథకంపై రేవంత్ రెడ్డి సర్కార్ సంతకం పెట్టి రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు. సోమవారం ఈ అంశంపై కవిత మీడియాకు ఒక వీడియో సందేశం విడుదల చేశారు. గతంలో రైతులను ఇబ్బంది పెట్టేలా చేసిన నల్ల చట్టాల్లో భాగంగా తేవాలనుకున్న స్మార్ట్ మీటర్లను మళ్లీ తేవాలని కేంద్రం చేస్తున్న కుట్రలకు రేవంత్ సర్కార్ మోకరిల్లిందని విమర్శించారు. అదానీ వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు, ప్రజలకు నష్టం చేసేందుకు ఈ స్మార్ట్ మీటర్లను తెస్తున్నారని మండిపడ్డారు. దీనికి సంబంధించి ప్రజల మైండ్ వాష్ చేసేందుకు ఇటీవలే నెక్లెస్ రోడ్ లో డెమో కార్యక్రమం పెట్టారన్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ సీఎండీ కూడా స్మార్ట్ మీటర్లు తెస్తున్నామని చెప్పారని వివరించారు. గతంలో మనం ఈఆర్సీలో గొడవ చేస్తే రైతుల బావికాడ మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పారని కవిత గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో ఇప్పుడున్నవన్నీ కూడా స్మార్ట్ మీటర్లే.. కానీ కొత్తగా తేనున్న స్మార్ట్ మీటర్ల ద్వారా చాలా నష్టం జరుగుతుందని ఆందోళ వ్యక్తం చేశారు. ఈ మీటర్లు పెడితే మనం ముందే ఫోన్ లో రీఛార్జ్ చేసుకున్నట్లు ప్రీ పెయిడ్ రీఛార్జ్ చేసుకోవాలని చెప్పారు. దీని ద్వారా మనకు ఎప్పుడు రీఛార్జ్ అయిపోతే అప్పుడు కరెంట్ పోతుందని వెల్లడించారు. యూపీలో ఇదే విధంగా మీటర్లు పెడితే ప్రజలు ఆ మీటర్లను తీసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ ఆఫీసుల్లో వేసి పోతున్నారని వివరించారు. పైగా స్మార్ట్ మీటర్ల కారణంగా ప్రభుత్వం ఇస్తామన్న 2 వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ ఎత్తివేసే పరిస్థితి ఉంటుందని కవిత హెచ్చరించారు. సెలూన్లకు ఇచ్చే ఫ్రీ కరెంట్ కు కూడా ఇబ్బంది అవుతుందన్నారు. తెలంగాణ రక్షణసేన ఇందుకు ఒప్పుకోదని హెచ్చరించారు. ముందు ఇప్పుడున్న మీటర్ల ద్వారానే 24 గంటల కరెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేయాలని సూచించారు. ఆటిజన్లు, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేసి కరెంట్ సరఫరా బాగా ఉండేలా చూడాలన్నారు. ఎప్పుడూ ప్రజల జేబులకు చిల్లు పెట్టే కార్యక్రమం కాకుండా వారికి మేలు చేసే పనిచేయాలని కవిత సూచించారు. స్మార్ట్ మీటర్లు పెట్టాలన్న ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు.