డిపెండెంట్ ఉద్యోగాలు దానం కాదు.. సింగరేణి కార్మికుల హక్కు
నామమాత్రంగా మెడికల్ బోర్డు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోం
సింగరేణి బొగ్గుపై ముఖ్యమంత్రిది తప్పుడు ప్రచారం
కార్పొరేట్లతో కలిసి సింగరేణిపై ప్రభుత్వం కుట్ర చేస్తోంది
-తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత
(తెలంగాణ రక్షణసేన, బంజారాహిల్స్ – హైదరాబాద్)
సింగరేణిలో కారుణ్య నియామకాలను తగ్గిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సంస్థను నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నదని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. డిపెండెంట్ ఉద్యోగాలు ప్రభుత్వం ఇచ్చే దాన ధర్మాలు కావని.. అవి సింగరేణి కార్మికుల హక్కు అని స్పష్టం చేశారు. సింగరేణిలో మెడికల్ అన్ ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న కార్మికులకు మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకుండా కాలయాపన చేశారని విమర్శించారు. హెచ్ఎంఎస్, తెలంగాణ రక్షణసేన సింగరేణి బాయిబాట కార్యక్రమం నిర్వహించి.. మెడికల్ బోర్డు పెట్టకుంటే నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరిస్తే నామ మాత్రంగా మెడికల్ బోర్డు నిర్వహిస్తున్నారని కవిత తెలిపారు. రెండు నెలలుగా నిర్వహిస్తున్న మెడికల్ బోర్డుల్లో 12.5 శాతం మంది కార్మికులను మాత్రమే అన్ ఫిట్ చేసి మిగతా వారిని డ్యూటీ ఫిట్ అని పేర్కొంటూ తిప్పి పంపుతున్నారని చెప్పారు. ఇలా పంపుతున్న వారిలో సీరియస్ ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు కూడా ఉంటున్నారని చెప్పారు. బొగ్గుకు తమ చెమట, రక్తాన్ని అద్ది తెలంగాణాకు వెలుగులు ప్రసాదిస్తున్న కార్మికుల సమస్యలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. సింగరేణిలో బొగ్గు తీస్తూ ఆ బొగ్గు వల్ల అనేక అనారోగ్య సమస్యలతో కార్మికులు చనిపోతున్నారని.. కార్మికుల త్యాగాలను గుర్తించే వారి వారసులకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చే విధానం తెచ్చారని వెల్లడించారు. ఇది ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలతో వచ్చింది కాదనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న సింగరేణి కార్మికులందరినీ అన్ ఫిట్ చేసి వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని.. లేదంటే తీవ్ర పరిణాలు ఎదుర్కోక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
జీ-9 కన్నా క్వాలిటీ బొగ్గు సింగరేణిలో ఉంది
ముఖ్యమంత్రి సింగరేణి బొగ్గు క్వాలిటీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కవిత ఆరోపించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు జీ-9 బొగ్గు కావాలని, మిగతా థర్మల్ పవర్ ప్లాంట్లకు జీ-11 బొగ్గు కావాలని.. ఆ బొగ్గు సింగరేణిలో లేదు కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని సీఎం అబద్ధాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింగరేణిలో జీ-3 నుంచి జీ-8 వరకు మంచి గ్రేడ్ బొగ్గు కూడా అందుబాటులో ఉందని చెప్పారు. ఈ ప్రభుత్వానికి ఆ బొగ్గును వాడుకునే నైపుణ్యం, తెలివి తేటలు, సమర్థత లేవని స్పష్టం చేశారు. సింగరేణిలోని జేవీఆర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, మణుగూరు ఓసీ-2 ఎక్స్ టెన్షన్, కేసీహెచ్ పీ (కొండాపురం కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్), కేసీహెచ్ పీ లైన్-1, రామగుండం 11 ఇంక్లైంన్, భూపాలపల్లి ఏరియాలోని కాకతీయ ఓసీపీ-2, ఓసీపీ-3, మందమర్రి ఏరియాలోని కాసిపేట-2, ఆర్ కేపీ సీహెచ్ పీ, శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్ కే-6, ఒడిషాలోని నైని కోల్ బ్లాక్ లోనూ జీ-9 బొగ్గు అందుబాటులో ఉందని తెలిపారు. సింగరేణికి ప్రభుత్వం బాకీ ఉన్న రూ.54 వేల కోట్లు ఎగ్గొట్టాలనే సీఎం ఇక్కడి బొగ్గు క్వాలిటీ లేదని చెప్తున్నడు.. బయటి రాష్ట్రాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవడానికి ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేయాలనే కుట్ర దీని వెనుక ఉన్నదని ఆరోపించారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి కుట్ర చేస్తూ సింగరేణిని దెబ్బతీయాలని చూస్తున్నాయని చెప్పారు. పర్మినెంట్ ఎంప్లాయిమెంట్ ను దెబ్బకొట్టాలని చూస్తున్నాయని విమర్శించారు. సింగరేణిలో ఉత్పత్తి అవుతున్న జీ-9 బొగ్గును కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇక్కడి పవర్ ప్లాంట్లకు మాత్రం ఆ బొగ్గు సరఫరా చేయడం లేదని కవిత దుయ్యబట్టారు. సింగరేణిపై ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తెలంగాణ రక్షణ సేన ప్రజలకు వివరిస్తుందని.. ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకొని తీరుతుందని స్పష్టం చేశారు.








