కాంక్రీట్ తో వేములవాడ రాజన్న గుడి కడుతూ భక్తుల విశ్వాసాన్ని దెబ్బ తీస్తున్నరు

రాజన్న ఆలయాన్ని కృష్ణ శిలలతో ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించాలి

రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ హిట్ జోడీ కాదు.. ఇడుపు కాయితం జోడీ

నవంబర్ వరకు రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వాల్సిందే

సిరిసిల్ల సెస్ లో జరిగిన అవినీతిపై విచారణ జరపాలి

నేరెళ్ల బాధితుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి వాళ్లను మళ్లీ మోసం చేశారు

-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

(తెలంగాణ రక్షణసేన, వేములవాడ) :

వేములవాడ రాజన్న గుడిని కాంక్రీట్ తో నిర్మిస్తూ భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం కృష్ణశిలలతో వెయ్యేళ్లు నిలిచేలా ఆలయాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆమె పర్యటించారు. వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆలస్యమైనా సరే భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆగమశాస్త్రం ప్రకారం వేములవాడ రాజన్న గుడిని నిర్మించాలని కోరారు. రాజన్న కోడెలు చనిపోతున్నప్పటికీ పట్టించుకోవడం లేదని వాటికి సరైన పశుగ్రాసం అందించడం లేదన్నారు.  కోడె మొక్కులకు ప్రసిద్ధి చెందిన వేములవాడ ఆలయంలో కోడెలకు ఇలాంటి దయనీయ పరిస్థితి మంచిది కాదని చెప్పారు. కోడెలు చనిపోతే శాస్త్ర ప్రకారం అంత్యక్రియలు కూడా జరిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడితే హిందూత్వ అనే బండి సంజయ్ ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా ఉండి కూడా ప్రసాద్ స్కీమ్ లో దక్షిణ కాశీగా ప్రాశస్త్యం పొందిన వేములవాడ ఆలయాన్ని చేర్చలేదని.. రాజన్న ఆలయానికి ఆయన ఒక్క రూపాయి కూడా తేలేదని దీనిపై సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నో రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే వేములవాడలో మౌలిక సదుపాయాలు ఏమాత్రం బాగాలేవన్నారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ బాగు చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే  కృషి చేయాలన్నారు. తమ అమ్మనాన్న పెళ్లి ఇక్కడే జరిగిందని ఈ ప్రాంతంతో తనకు ఎంతో అనుబంధం ఉందని కవిత గుర్తు చేసుకున్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టుతో సిరిసిల్ల, వేములవాడకు ఎంతో ప్రయోజనం దక్కాలని.. కానీ ఒక్క ఎకరాకు కూడా నీళ్లు రాలేదని చెప్పారు. రుద్రంగిలో 2018లో శంకుస్థాపన చేసిన రిజర్వాయర్ ను పదేళ్లైనా పూర్తి చేయలేదన్నారు. అది పూర్తైతే 63 వేల ఎకరాలకు నీళ్లొస్తాయన్నారు. దూమ్ పేట్ వద్ద రిజర్వాయర్ కట్టి ఎత్తిపోస్తే కథలాపూర్, మేడిపల్లికి నీళ్లు వస్తాయన్నారు. ఎర్రకుంట, పటేళ్ల చెరువును కలిపి అక్కడ రిజర్వాయర్ కడితే వేములవాడ, చందుర్తి, కోనరావు పేట మండలాలకు  నీళ్లు వచ్చే అవకాశం ఉందన్నారు. తెలంగాణ వచ్చి 13 ఏళ్లైనా ఇలాంటి పరిస్థితి ఉండటం అన్యాయమన్నారు. మిడ్ మానేర్, అప్పర్ మానేర్ లింక్ పనులను పూర్తి చేయాలని.. అది పూర్తి చేస్తే లక్షా 10 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వవచ్చని చెప్పారు. 

సెస్ లో అవినీతిపై విచారణ జరపాలి

సిరిసిల్లలోని సెస్ లో జరిగిన రూ.32 కోట్ల అవినీతిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని కవిత డిమాండ్ చేశారు. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో ఈ అవినీతి జరిగిందని.. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విచారణ జరపటం లేదని ప్రశ్నించారు. సెస్ లో జరిగిన అవినీతి బయట పడకుండా ఉండేందుకు సరిగ్గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ అగ్నిప్రమాదం జరిగిందని గుర్తు చేశారు. ఆ ప్రమాదంలో ఫైల్స్ అన్ని కాలిపోయాయని చెప్పి చేసిన అవినీతి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారన్నారు. సహకార విద్యుత్ రంగంలో ప్రతిష్ఠాత్మకమైన సెస్ ను ఎన్పీడీఎల్ లో కలిపి వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. నేతన్నలు, చేనేతలు ఎక్కువగా ఉన్న సిరిసిల్లలో యార్న్ డిపో ఏర్పాటు చేయకుండా అధికార దర్పం ప్రదర్శించేందుకు వేములవాడలో ఏర్పాటు చేశారని విమర్శించారు. రాజకీయాల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టటం మంచిది కాదని సూచించారు. 

సిరిసిల్ల జిల్లా అయిన తర్వాత నీటి పారుదల రంగంలో ఎంతో మార్పు వస్తుందని భావించినప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితే ఉందన్నారు. యువ సామ్రాట్ అని చెప్పుకునే కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న సిరిసిల్లలో జేఎన్టీయూను తీసుకొస్తే ల్యాబ్ కోసం జగిత్యాలకు వెళ్లే పరిస్థితి తెచ్చారని ఎద్దెవా చేశారు. మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసినా మెడికోలకు కనీసం హాస్టల్ లో సరైన సౌకర్యాలు లేకుండా చేశారన్నారు. ఒక్కో రూమ్ లో 16 మంది ఉంటున్నారని తెలిపారు. గల్ఫ్ బాధితులను ఆదుకునే విషయంలో గత ప్రభుత్వం విఫలమైందని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అడ్వయిజరీ కమిటీ కూడా ఆగమైందన్నారు. ఇప్పటికైనా గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు గల్ఫ్ లో చనిపోయిన 112 మంది కార్మికులకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందజేయాలన్నారు. సిరిసిల్ల ప్రజల దశాబ్దాల రైలు కల సాకారం చేసేందుకు తమ పార్టీ తరఫున పోరాటం చేస్తామన్నారు. సిరిసిల్లలో ముంజూరైన 15 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ ను పూర్తి చేసేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి చేయాలని కోరారు. 

అబద్ధాలొద్దిన్

రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ లు మాట్లాడితే హిట్ జోడి అంటున్నారని.. కానీ వాళ్లది ఇడుపు కాగితం జోడీ అని  ఎద్దెవా చేశారు. మహేశ్ కుమార్ గౌడ్ ఒకటి మాట్లాడితే.. రేవంత్ రెడ్డి ఒకటి మాట్లాడుతున్నారని.. హిట్ జోడీ అయితే వేర్వేరుగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఆగమావుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వేసిన కోటి 10 లక్షల ఎకరాల పంటలను కాపాడాలంటే నవంబర్ వరకు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అడుక్కోనైనా, కొనుక్కోనైనా ఉచిత కరెంట్ ఇవ్వాలన్నారు. లేదంటే పార్టీలకు అతీతంగా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. రేవంత్ సర్కార్ అన్ని అంశాల్లోనూ ఫెయిల్ అయ్యిందని ప్రతి దానికీ కమిటీ అంటూ కాలయాపన చేస్తుందన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయంలో వారిని మోసం చేశారని చెప్పారు. ఉర్దూ పేపర్ కు సంబంధించి మండలానికి ఒక్కరికే అక్రిడేషన్ ఇస్తామంటున్నారని..  ముస్లింలు అన్నా ఉర్దూ అన్నా రేవంత్ రెడ్డికి ఎందుకంత చిన్నచూపని ప్రశ్నించారు. ముస్లింలకు ఏదో మంచి చేస్తున్నట్లు తన పేరు రేవంతొద్దీన్ అని చెప్పుకుంటున్నారని కానీ ఆయన పేరు అబద్దాలొద్దీన్ అని పెట్టుకోవాలన్నారు. 

నేరెళ్ల బాధితులకు న్యాయం చేసే వరకు పోరాడుతాం

నేరెళ్ల బాధితుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి వాళ్లను మళ్లీ మోసం చేశారని  మండిపడ్డారు. సిరిసిల్ల సభలో వారికి న్యాయం చేస్తారని భావిస్తే రూ. 5 లక్షలు, రూ.10 లక్షల చెక్కులిచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. వారిని గ్రూపులుగా విడగొట్టి పరిహారంలో వ్యత్యాసం చూపడం అన్యాయమన్నారు. రేవంత్ రెడ్డి సభ తర్వాత నేరెళ్ల బాధితులు తనను కలిసి ముఖ్యమంత్రి చేసిన మోసాన్ని వివరించారని చెప్పారు. వారి కేసులకు సంబంధించిన ఆధారాలను పూర్తిగా మాయం చేశారని.. ఆనాటి జైలర్, అప్పటి డీఐజీ  బాధితులతో చేసిన విచారణ నివేదికలు ఎక్కడ పోయాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై సిరిసిల్ల ఎస్పీ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు కోటి రూపాయల పరిహారంతో పాటు మూడు ఎకరాల భూమి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చే పార్టీగా నేరెళ్ల బాధితులకు న్యాయం జరిగే వరకు తాము పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ప్రధాన పార్టీలతో సమానంగా తమ పార్టీ ఉద్యమిస్తుందని.. ప్రజల పక్షాన పని చేస్తుందని తెలిపారు.