కాన్షీరాంకు భారత రత్న ఇవ్వాలి
ఆయన స్ఫూర్తితో సామాజిక న్యాయ తెలంగాణ సాధిస్తాం
-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
(తెలంగాణ రక్షణసేన,హైదరాబాద్):
అణగారిన వర్గాలకు రాజకీయ అధికారం కావాలన్న అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చూపిన మహనీయుడు కాన్షీరాం అని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా శుక్రవారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాన్షీరాంకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన స్ఫూర్తితో సామాజిక న్యాయ తెలంగాణ సాధిస్తామని చెప్పారు. అణగారిన వర్గాలకు నిజమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే ఆ మహనీయునికి మనమిచ్చే ఘనమైన నివాళి అని చెప్పారు. రాబోయే రోజుల్లో కచ్చితంగా అణగారిన వర్గాలను అసెంబ్లీకి తీసుకెళ్లి తీరుతామన్నారు. తెలంగాణ రక్షణ సేన సామాజిక న్యాయ సంకల్పానికి కాన్షీరామే స్ఫూర్తి అని చెప్పారు. తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలంతా ఈ సామాజిక న్యాయ సంకల్పానికి కట్టుబడి, బహుజన సాధికారత కోసం నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు.

ప్రతి ఇంటికి పాంచజన్యం తీసుకెళ్లండి
తెలంగాణ రక్షణ సేన ప్రధాన సిద్ధాంతమైన పాంచజన్యాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ చార్జీలు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, అనుబంధ విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ప్రజలకు ఏ సమస్య ఉన్నా పార్టీ నాయకులు, కార్యకర్తలు వారికి అండగా నిలవాలని సూచించారు. నిజామాబాద్ జిల్లాలో రైతులను దోపిడీ చేస్తున్న దళారులను పార్టీ నాయకత్వం ప్రశ్నిస్తే ఇప్పుడు అన్ని పార్టీలు రైతులకు అండగా నిలుస్తున్నాయని తెలిపారు. మనం చేసే మంచి కార్యక్రమాలు వేలాది మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తాయని చెప్పడానికి నిజామాబాద్ లో పార్టీ నాయకులు చేపట్టిన కార్యక్రమాలే చాటి చెప్తాయని అన్నారు. ప్రతి నాయకుడు నిత్యం ప్రజల మధ్యే ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ ఏడాది పొడవునా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. వాటిపై ఎక్కడిక్కడ ప్రజలను చైతన్య పరచాలని సూచించారు. ప్రధాన రాజకీయ పార్టీలతో మనం తలపడాల్సి ఉంటుందని.. అందుకు పార్టీ నాయకత్వం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.








