కాలనీలో మిగిలిన 4 ఎకరాల భూమి కబ్జాకు గురికాకుండా కాపాడాలి
మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వెంటనే చిత్రపురి కాలనీలో అక్రమాలపై స్పందించాలి
-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
టీఆర్ఎస్ చీఫ్ తో చిత్రపురి కాలనీ సాధన సమితి నాయకుల భేటీ
(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్) :
చిత్రపురి కాలనీ సోసైటీలో జరిగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్న అనిల్ అనే వ్యక్తి.. సోసైటీలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. ఒకే వ్యక్తి ఇంత అవినీతికి పాల్పడటానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని మంత్రుల సహకారం ఉందని చెప్పారు. అనిల్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని చెప్పి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. చిత్రపురి కాలనీ సాధన సమితి నాయకులతో కలిసి శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఫిల్మ్ ఫెడరేషన్ లోని అన్ని విభాగాలను చెరబట్టిన అనిల్.. ఇప్పటికీ చిత్రపురి కాలనీలో అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. సినీ కార్మికులకు మేలు చేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నటుడు ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీకి 1994 లో 67 ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారు. వాటిలో కార్మికులకు ఇళ్లను కేటాయించే విషయానికి సంబంధించి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పారు. అప్పటి మంత్రుల సహకారంతో అవినీతికి పాల్పడిన అనిల్… ఇప్పుడు కాలనీలో మిగిలి ఉన్న 4 ఎకరాల భూమిపై కన్నేశారన్నారు. కో ఆపరేటివ్ సోసైటీ రూల్స్ ను తుంగలో తొక్కి ఆ భూమిని మార్టిగేజ్ పెట్టి రూ. 19 కోట్లు తీసుకున్నారన్నారు. తాజాగా ఆ భూముల్లో ఫ్లాట్లు కడుతున్నామంటూ నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఇంత బాహాటంగా ఫ్లాట్లు కడుతున్నామంటూ అవినీతికి పాల్పడుతుంటే..కో ఆపరేటివ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర్ రావు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే ఈ భూమి విషయంలో జోక్యం చేసుకుని ఆ భూమిని పేద సినీ కార్మికుల ఇళ్ల నిర్మాణం కోసం ఉపయోగించాలని కోరారు.
అనిల్ ను వెంటనే తొలగించాలి
ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్న అనిల్ ను వెంటనే తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కవిత డిమాండ్ చేశారు. ఫ్లాట్ల విషయంలోనే కాకుండా అక్కడ ఇళ్ల సముదాయాలను బట్టి కూడా వసూళ్లకు పాల్పడ్డారన్నారు. ఇటీవల జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ కోసం సోసైటీ వాళ్ల నుంచి రూ.2 లక్షలు వసూలు చేశారని చెప్పారు. మళ్లీ ఆదివారం జరగనున్న సీఎం సభ కోసం మరోసారి రూ.2 లక్షలు కావాలంటూ బెదిరిస్తున్నాడన్నారు. అదే విధంగా తోట రామకృష్ణ అనే సీనియర్ డైరెక్టర్ కు కేటాయించిన ఇంటిని వేరే వాళ్లకు అమ్మారని.. అడిగితే బాధితులను బెదిరిస్తున్నారని చెప్పారు. అయినప్పటికీ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. ఆదివారం జరిగే సభలో ముఖ్యమంత్రి రూ.10 కోట్లు కేటాయిస్తారని చెబుతున్నారని దాన్ని అనిల్ కు ఇవ్వవద్దని సూచించారు. ఆయన ద్వారా న్యాయం జరుగుతుందన్న నమ్మకం చిత్రపురి కాలనీ వాసులకు లేదని.. ఆ మొత్తాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ కార్పొరేషన్ కు కేటాయించాలని కోరారు. ప్రస్తుతం చిత్రపురి కాలనీలో భూమి విలువ ఏడు వేల కోట్లు ఉంటుందని..అలాంటి చోట ఒకే వ్యక్తి ఇంత అవినీతి చేస్తుంటే ఎందుకు శిక్ష పడటం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. వెంటనే అనిల్ ను ఫెడరేషన్ అధ్యక్ష పదవి నుంచి తొలగించి అతనిపై చర్యలు తీసుకోవాలన్నారు.
సినీ పెద్దలు జోక్యం చేసుకోవాలి
సినీ కార్మికులు ఎంతో కష్టపడి ఇళ్లు కొనుక్కుంటే వారికి అన్యాయం జరుగుతోందని.. ఈ విషయంలో సినీ పెద్దలు చిరంజీవి, పవన్ కల్యాణ్, సురేష్ బాబు, దిల్ రాజు లాంటి వాళ్లు జోక్యం చేసుకోవాలని కవిత కోరారు. అలాట్ మెంట్ కమిటీలో ఉన్న కాంగ్రెస్ కు చెందిన పీవీ శ్రీనివాస్ సతీమణికి ఇళ్లు కేటాయించారని చెప్పారు. అలాట్ మెంట్ కమిటీలో ఉన్న ఆమెకు ఇల్లు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. అదే కమిటీలో ఉన్న సుద్ధాల అశోక్ తేజ ఈ విషయంలో అక్కడ జరుగుతున్న అవినీతిని బయటకు వచ్చి చెప్పాలని కోరారు. మరో రెండేళ్లలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని..అప్పుడు సినీ కార్మికులకు న్యాయం చేస్తామని వారికి భరోసా ఇచ్చారు. చిత్రపురి కాలనీలో జరుగుతున్న అన్యాయంపై బాధితులతో కలిసి తాము పోరాటం చేస్తామన్నారు. కవితను కలిసిన వారిలో చిత్రపురి కాలనీ సాధన సమితి అధ్యక్షుడు డాక్టర్ కస్తూరి శ్రీనివాస్, సుధీర్ కలగర, రవీంద్ర నాథ్ ఠాగూర్, తోట హరిత, లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.








