తెలంగాణ రాష్ట్రం అంబేద్కర్ పెట్టిన భిక్షే
-కల్వకుంట్ల కవిత
ఆర్టికల్ 3 అనే శక్తి ఇవ్వటం కారణంగే తెలంగాణ ఏర్పాటుకు పునాది పడింది
లిబర్టీ సర్కిల్ లో అర్ధరాత్రి అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న కవిత
(ట్యాంక్ బండ్, హైదరాబాద్)
బాబా సాహెబ్ అంబేద్కర్ దూరదృష్టితో పెట్టిన ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 3 అనే శక్తి లేకపోతే తెలంగాణకు నైతిక పునాది ఇవ్వకపోయి ఉంటే మనం రాష్ట్రం సాధించుకునే వాళ్లం కాదని చెప్పారు. అంబేడ్కర్ అంటే సాధారణ వ్యక్తి కాదు. ఆయన ఒక ఐడియాలజీ అని స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా లిబర్టీ సర్కిల్ లోని ఆయన విగ్రహానికి సోమవారం అర్ధరాత్రి కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని బాబాసాహెబ్ బర్త్ డే కేక్ కట్ చేశారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ 135 వ జయంతి సందర్భంగా కవిత అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

అంబేద్కరిజం వ్యతిరేకి రేవంత్
“తెలంగాణ రాష్ట్రం ఏర్పడిదంటే అది బాబాసాహెబ్ అంబేడ్కర్ బిక్షే. వచ్చిన తెలంగాణలో అంబేడ్కర్ కోరిక ప్రకారం స్టేట్ సోషలిజం వర్థిల్లాల్సి ఉండే. కానీ 12 ఏళ్లలో దురదృష్టవశాత్తు ఆ పరిస్థితి మాత్రం రాలేదు. ఇప్పటికీ ప్రతి చోట దళితులు, మహిళలపై ఆకృత్యాలు ఇంకా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ కట్టినా సరే దళితులే భూములు కోల్పోతున్నారు. దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను ప్రభుత్వాలు లాక్కుంటున్నాయి.
ఈ పరిస్థితిని సవరించుకుంటూ పేదల భూములను కాపాడుకుంటూ ముందుకు వెళ్లాల్సిన సందర్భం ఇది.
మనం వెలుగుమట్లలో చూశాం. పరిగిలో కూడా అసైన్డ్ భూములనే పెద్ద ఎత్తున తీసుకుంటున్నారు. అక్కడ 1200 ఎకరాలు సేకరిస్తే అందులో వెయ్యి ఎకరాలు అసైన్డ్ భూములే. బాబా సాహెబ్ అంటేనే ధైర్యం. ఆయనిచ్చిన ధైర్యంతో పేదవాళ్లకు న్యాయం చేసేలా ప్రభుత్వంపై పోరాటం చేస్తాం. ఈ భూమి మీద ఎవరైనా యాంటీ అంబేడ్కర్ ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి మాత్రమే. బాబా సాహెబ్ 135 వ జయంతి సందర్భంగానైనా ఈ ప్రభుత్వానికి బుద్ది రావాలి. వాళ్లు పేదల పక్షాన నిలబడాలి. అంబేడ్కర్ గారంటే ఒక సాధారణ మనిషి కాదు. ఆయన ఒక ఐడియాలజీ, ఒక థాట్. ఆయన ఐడియాలజీ నిరంతరం మన మధ్యనే ఉంటుంది. బాబా సాహెబ్ ఆడబిడ్డలకు ఎంతో మంచి చేశారు. అంబేడ్కర్ స్ఫూర్తితో ఇంకా ఎన్నో ఉద్యమాలు వచ్చి మన కష్టాలు అన్ని తొలగిపోవాలి. బాబా సాహెబ్ 135 వ జయంతి వేడుకలను ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ ఫోరమ్ ఆధ్వర్యంలో వినూత్నంగా నిర్వహించటం సంతోషం. మంచి కాన్సెప్ట్ ద్వారా ముందుకు వచ్చిన కుమారన్నకు ధన్యవాదాలు.








