బరాబర్.. తెలంగాణ మా అయ్యా తాతల జాగీరే
మా గడ్డపై తిక్క చేష్టలు చేస్తే పొలిమేర దాకా తరిమికొడతాం
పవన్ కల్యాణ్ ను హెచ్చరించిన టీఆర్ఎస్ నాయకుడు చిలుక ప్రవీణ్
(హైదరాబాద్):
మిస్టర్ పవన్ కల్యాణ్… తెలంగాణ బరాబర్ మా అయ్యలు, తాతల జాగీరే.. తెలంగాణ అస్తిత్వాన్ని, ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోం.. అంటూ తెలంగాణ రక్షణ సేన నాయకుడు చిలుక ప్రవీణ్ హెచ్చరించారు. అటు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని పార్టీలతో ఉద్యమకారులను గుర్తిస్తారా అంటూ టీఆర్ఎస్ నేత మహేందర్ రెడ్డి ప్రభుత్వంపైసమండిపడ్డారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో చిలుక ప్రవీణ్, మహేందర్ రెడ్డి వేర్వేరుగా ప్రెస్ మీట్ నిర్వహించారు.
పొలిమేర దాకా తరిమికొడతాం -చిలుక ప్రవీణ్
తెలంగాణలో తిక్క చేష్టలు చేస్తే పొలిమేరదాకా తరిమికొడతామని పవన్ కల్యాణ్ ను చిలుక ప్రవీణ్ హెచ్చరించారు. ఎంత అహంకారం కాకపోతే తెలంగాణను పాకిస్తాన్, పాలస్తీనాలతో పోల్చుతావా అంటూ మండిపడ్డారు. రేవంత్ సర్కార్ చేతగాని తనంతో పవన్ కల్యాణ్ రెచ్చగొట్టే రాజకీయాలు చేసున్నారని ప్రవీణ్ విమర్శించారు. కల్వకుంట్ల కవిత సీఎంగా ఉండి ఉంటే.. పవన్ మాట్లాడిన మాటలకు… ఆయనను ఇప్పటికే అరెస్ట్ చేసి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్పించేవారన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ సైలెంట్ గా ఉండటం విచారకరమని అన్నారు. రేవంత్ రెడ్డి, బీజేపీ, బీఆర్ఎస్ ఇచ్చిన ధైర్యంతోనే పవన్ కల్యాణ్ తెలంగాణ గడ్డపై విర్రవీగుతున్నారన్నారు. ఏపీలోనే దిక్కులేని పవన్ కేవలం తన ఆస్తులను కాపాడుకోవటానికి ఇక్కడ రాజకీయ డ్రామా ఆడుతున్నాడన్నారు. నవ నిర్మాణ సభ అని చెప్పిన పవన్ కల్యాణ్… తెలంగాణలో రైతు సమస్యపై ఎందుకు మాట్లాడలేదో చెప్పాలన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొడుతుంటే ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. కోడి చెరువు కబ్జాపై స్పష్టత ఇవ్వాలన్నారు. భవిష్యత్తులో టీడీపీ, బీజేపీ, అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని కలుపుకొని పోయేందుకు కూడా పవన్ సిద్ధంగా ఉన్నాడని అన్నారు. గద్దరన్నకు వెహికిల్ కొనిచ్చానని గొప్పలు చెప్పుకుంటూ ఆయనను పవన్ కల్యాణ్ అవమానించారన్నారు. తెలంగాణలో పోటీ చేస్తామంటున్న జనసేనకు స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. పవన్ కల్యాణ్ తెలంగాణలో పోటీ చేసి నోటాతో పడవచ్చని తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. మీడియా సమావేశంలో టీఆర్ఎస్ నేతలు మంచాల వరలక్ష్మి, దండెం ఆనంద్ పాల్గొన్నారు.

ఉద్యమంతో సంబంధం లేని పార్టీలతో ఉద్యకారుల గుర్తింపా?-మహేందర్ రెడ్డి
తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకుండా తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలతో ఉద్యమకారులను ఎలా గుర్తిస్తారని టీఆర్ఎస్ నేత మహేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యమకారుల గుర్తింపు కోసం జూన్ 4 న ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించిన పార్టీల జాబితా చూస్తుంటే ఆశ్చర్యం వేస్తున్నదన్నారు. టీఆర్ఎస్ నేతలు పాలె నిషా, హుస్సేన్ తో కలిసి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణను వ్యతిరేకించిన టీడీపీ, వైసీపీలను ఎందుకు ఆహ్వానించారని ప్రశ్నించారు. ఆమ్ ఆద్మీ, నేషనల్ పీపుల్స్ పార్టీ కి తెలంగాణ ఉద్యమంతో ఏం సంబంధమో చెప్పాలన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన ఎంఐఎం, సీపీఎం లను ఎలా పిలుస్తారని నిలదీశారు. నిజంగా ఉద్యమకారులను గుర్తించాలనే చిత్తశుద్ధి ఉంటే నిఖార్సైన ఉద్యమపార్టీలు, ఉద్యమకారులను పిలవాలన్నారు. తెలంగాణ పోరాటంలో కీలకంగా ఉన్న తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవితను, తెలంగాణ జన సమితిని సమావేశానికి ఎందుకు పిలవాలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఉద్యమకారుల అంశంపై పెద్ద ఎత్తున భూపోరాటం చేస్తామని కవిత హెచ్చరించిన తర్వాతే ఈ ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. ఉద్యమకారుల గుర్తింపు అంశంలో చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తే మాత్రం కచ్చితంగా రేవంత్ సర్కార్ ప్రజావ్యతిరేకత, ఉద్యమకారుల ఆగ్రహం చవిచూడక తప్పదని హెచ్చరించారు.








