సమస్యలు మరచిన వీకెండ్ ఎమ్మెల్యే
సెస్ ను తీసేసినా.. రైతు డిస్కం పెడతామన్నా ఒక్క మాట మాట్లాడలేదు
కేటీఆర్ పై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ధ్వజం
నెరేళ్ల బాధితులకు న్యాయం చేసి చూపిస్తాం
సిరిసిల్లలో అట్టహాసంగా టీఆర్ఎస్ జెండా పండుగ
(తెలంగాణ రక్షణసేన, సిరిసిల్ల)
సిరిసిల్ల వీకెండ్ ఎమ్మెల్యే కేటీఆర్ కు ప్రజాసమస్యలపై మాట్లాడే తీరిక లేకుండా పోయిందని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఎద్దెవా చేశారు. రైతుడిస్కమ్, సెస్, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై వీకెండ్ లో వచ్చి పోయే ఎమ్మెల్యే తీరిక లేక మాట్లాడలేదేమో అని వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో గురువారం సాయంత్రం ఘణంగా టీఆర్ఎస్ జెండా పండుగ నిర్వహించారు. సిరిసిల్ల చౌరస్తాలో డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రి బాయి ఫూలే విగ్రహాలకు పూల మాలలు వేశారు. అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన పార్టీ జెండా ఆవిష్కరణకు, పార్టీ సభకు పెద్ద ఎత్తున మహిళలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..సిరిసిల్ల నియోజకవర్గంలో కాళేశ్వరం నుంచి లక్షా 8 వేల ఎకరాలకు నీళ్లు రావల్సి ఉంటే…480 ఎకరాలకు మాత్రమే నీళ్లు వస్తున్నాయని చెప్పారు.
ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పుకునే ఎమ్మెల్యే కేటీఆర్ నీళ్లు ఎందుకు తేలేదని ప్రశ్నించారు. వేములవాడలో ఇంకా 77 వేల ఎకరాలకు కాళేశ్వరం నుంచి నీళ్లు రావల్సి ఉందన్నారు. సిరిసిల్ల అంటేనే అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన పద్మశాలీ ముద్దుబిడ్డల అడ్డా అని, ఎమ్మెల్యే ప్రతి సోమవారం చేనేత దుస్తులు ధరిస్తా, పద్మశాలీలకు న్యాయం చేస్తా అన్నాడని గుర్తు చేశారు. వర్కర్ టు ఓనర్ పథకం అని ప్రకటించారని, దాన్ని పూర్తి చేయలేదని, అది చేసి ఉంటే ఎంతో మంది వర్కర్లు ఓనర్లు అయ్యే వారని కవిత చెప్పారు.
సరైన ఉపాధి లేక ఇప్పటికీ చేనేత కార్మికులు వేరే ఎక్కడో పనిచేసుకోవల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లలో చేనేత కార్మికులుంటే వేమువాడలో యార్న్ డిపో పెట్టి రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు.

నేరెళ్ల బాధితులకు న్యాయం చేస్తా
ఇచ్చిన హామీలు అమలు చేయని రేవంత్ రెడ్డి పై యుద్దం చేద్దామా అని కవిత సభకు వచ్చిన మహిళలను ఉద్దేశించి ప్రశ్నించారు. వీకెండ్ ఎమ్మెల్యే కేటీఆర్ పోరాటం బంద్ చేసిండని, పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద మాట్లాడినా చప్పుడు చేస్తలేడని విమర్శించారు.
ఆయనను మీరే యుద్ధానికి సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో సామాజిక న్యాయానికి తూట్లు పొడిచారని, తమ అక్రమ సంపాదన కోసం నెరేళ్లలో దళితులు, బీసీలను ఘోరంగా కొట్టారని మండిపడ్డారు. అధికారం ఉందని మీ అక్రమ సంపాదన కోసం ఇష్టమొచ్చినట్లు బీసీలు, ఎస్సీలను కొడతరా అని ప్రశ్నించారు. ఈ ఘటన జరిగి 9 ఏళ్లు అయినా ఆ బిడ్డలకు న్యాయం జరగలేదన్నారు. ఇటీవలే బాధితులు తమను కలిశారని చెప్పారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కూడా వాళ్లను ఆదుకుంటామని చెప్పి పైసా సాయం చేయలేదని చెప్పారు. కేంద్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ దగ్గర ఈ కేసు పెండింగ్ లో ఉందని, బండి సంజయ్ ఈ కేసు విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బండి సంజయ్ కార్పొరేటర్ గా ఉన్నప్పుడు ఈ బాధితుల కాళ్లు పట్టుకొని వాళ్లతో కేసు వేయించారని గుర్తు చేశారు. ఇప్పుడు వాళ్లు ఇబ్బందులు పడుతుంటే సంజయ్ బుగ్గ కారులో తిరుగుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కూడా వచ్చి నెరేళ్ల బాధితులను ఆదుకుంటామని చెప్పారని,
స్టేట్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ వద్ద కూడా పెండింగ్ లో ఉన్న కేసును విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కేటీఆర్ లకు అక్రమ సంపాదనతో కళ్లు మూసుకుపోయినయని విమర్శించారు. నెరేళ్ల బాధితులకు ఏ విధంగా అండగా ఉంటానో తాను చూపిస్తానన్నారు. వారం రోజుల్లో వాళ్లను కలుస్తా.. వాళ్లకు కచ్చితంగా న్యాయం జరిగేలా చేస్తానని ప్రకటించారు.


పాంచజన్యంతో సామాజిక తెలంగాణ
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలతో పేగు బంధాన్ని తెంపేసుకుందని కల్వకుంట్ల కవిత అన్నారు. పాంచజన్యం పేరుతో తాను ఐదు అంశాలను ప్రధానంగా తీసుకున్నానన్నారు.
ధర్మం ఎటు వైపు ఉంటే అటు వైపు ఉండాలని అర్జునుడికి శ్రీ కృష్ణుడు చెప్పాడని, మేము కూడా పాంచజన్యం పేరుతో ధర్మం వైపు ఉండాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు.
సిరిసిల్లలో ఇప్పుడే మేము మొదటి అడుగు వేశామని, ఇక్కడ టీఆర్ఎస్ గెలిచే వరకు మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటానని ప్రకటించారు. తెలంగాణ రక్షణ సేన అనే కొత్త పార్టీతో మీ ముందుకు వచ్చానన్నారు. ఇప్పటికే ఇన్ని పార్టీలు ఉంటే ఇంకో పార్టీ ఎందుకు అని మా అక్క చెల్లెళ్లు అనుకోవచ్చు.. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పేదలు, మధ్య తరగతి ప్రజలు విద్య, వైద్యం కోసం ఎంతో ఖర్చు చేయాల్సి వస్తున్నదన్నారు. మనం పేగులు తెగేదాక కొట్లాడి, 1200 మంది బిడ్డలను పొగొట్టుకుని తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తు చేశారు. కానీ ఇప్పటికీ పేదలు, మధ్య తరగతి పిల్లలకు చదువుకునేందుకు మంచి స్కూళ్లు లేవన్నారు. గవర్నమెంట్ స్కూల్లో పంతులు ఉంటే స్కూల్ ఉండదు.. స్కూల్ ఉంటే పంతులు ఉండడన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం కోసం వెళితే పూర్తిగా దోపిడీ చేస్తున్నారని చెప్పారు. ఇక పేదలకు ఇవ్వాల్సిన ఇళ్లను కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్లు వాళ్ల పార్టీ వాళ్లకే ఇచ్చుకున్నారన్నారు. నిజమైన పేదలకు ఎవరైనా ఇళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇవ్వాళ నేను సిరిసిల్లకు వస్తుంటే ఆడబిడ్డలు వచ్చి మాకు ఇళ్లు కావాలని అడుగుతున్నారని కవిత చెప్పారు. నాకు చాలా సంతోషం అనిపించింది.. ఎవరైనా మగ నాయకులు ఉంటే వాళ్లు అంత ధైర్యంగా అలా అడిగే వారా అన్నారు. ఆడబిడ్డల కష్టం తనకు తెలుసని, వాళ్లకు ఏమీ కావాలో కూడా తనకు తెలుసన్నారు. ఇంట్లో మగవాళ్లు పనిచేయకపోయినా సరే ఇంటిని నడిపేది ఆడవాళ్లేనన్నారు. అందుకే మన పార్టీ జెండాలో ఆడవాళ్లకు ఎంతో పవిత్రమైన పసుపు రంగును పెట్టుకున్నామని చెప్పారు. మన పార్టీ జెండాలో ఉండే నీలం రంగు కూడా శ్రామికులు, కార్మికులు, ఎస్సీ, ఎస్టీలకు సూచిస్తుందన్నారు. తెలంగాణలో పేదలు, మధ్య తరగతి ప్రజలు విద్య, వైద్యం కోసం రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండవద్దని తాను పంతం పట్టానన్నారు. అందుకే ఉచిత విద్య, వైద్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కావాలని కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదన్నారు. మేము అధికారంలోకి వస్తే యువతకు స్వయం ఉపాధి లాంటి గ్రూప్స్ ఏర్పాటు చేసి వాళ్లకు రూ.2లక్షల నుంచి 20 కోట్ల వరకు ఋణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాలు లేక ఇప్పటికీ యువత వాళ్ల అమ్మ నాన్నల దగ్గర డబ్బు తీసుకోవటానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారని కవిత చెప్పారు. ఇక రైతులకు గౌరవం పెరగాలని.. అందుకే ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో వాళ్ల కోసం మేము ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు యూరియ కూడా దొరకటం లేదని కవిత విమర్శించారు. యూరియ కోసం యాప్ తెచ్చారని, దాంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వెంటనే యూరియా యాప్ ను రద్దు చేయాలని కవిత డిమాండ్ చేశారు.








