అవసరమైతే పాదయాత్ర – తుమ్మిళ్ల ఎత్తిపోతల సందర్శన

తెలంగాణ ఏర్పడ్డాక కూడా ప్రాజెక్టులు పూర్తి చేసుకోలేకపోవడానికి ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా పర్యటించిన ఆమె తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ ను పరిశీలించారు. 

పంపు హౌస్ మూడు మోటార్లు అందుబాటులో ఉండగా కేవలం ఒకే మోటార్ రన్ చేయడానికి కారణాలు, తుమ్మిళ్ల నిర్మించినా ఆర్ డీ ఎస్ ఆయకట్టు పెరగక పోవడానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్ డీ ఎస్ ను పూర్తి స్థాయిలో వినియోగించేందుకు అవసరమైతే పాదయాత్ర చేస్తానని ప్రకటించారు.

సగం కూడా వాడుకోలేదు

“తెలంగాణ వచ్చి 12 ఏళ్లు గడిచినా ఆర్ డీ ఎస్ లో హక్కు మేరకు నీటిని వాడుకోలేకపోతున్నాం. తుమ్మిళ్ల కట్టినా పెద్దగా ప్రయోజనం దక్కలేదు. రాజోలి బండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) కు కేటాయించిన నీటిని మనం పూర్తి స్తాయిలో వాడుకోలేకపోతున్నాం. అందుకే తెలంగాణ వచ్చాక తుమ్మిళ్ల లిప్ట్ ఇరిగేషన్ ప్లాన్ చేశారు. ఆర్డీఎస్ మొత్తం కెపాసిటీ 16 టీఎంసీలు వాడుకోవటం, ఆయకట్టు స్థిరీకరణ కోసం తుమ్మిళ్ల లిప్ట్ ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ మొత్తం మూడు మోటార్లు ఉంటే ఒక్కటే వాడుతున్నారు. మిగతా వాటిని వాడుకోవాలంటే కాల్వ విస్తరణ చేయాలి. అందుకోసం భూ సేకరణ చేయడంతో పాటు.. రైతులు ఒక్క ఏడాది పంట మానుకోవాల్సిన పరిస్థితి ఉంది. రైతులు పంట వేయకుండా ఉండటానికి ఒప్పుకోకపోవడంతో కాల్వల విస్తరణ ముందుకు సాగలేదు. దీనికి ప్రత్యామ్నాయంగా ఒక టీఎంసీతో మల్లమ్మకుంట రిజర్వాయర్ ప్రపోజ్ చేశారు. ఇక్కడ కూడా చిన్న రైతులే ఉండటంతో భూసేకరణకు వాళ్లు ఒప్పుకోలేదు. నిజానికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి మొత్తం నీళ్లను మనం వాడుకోవాల్సి ఉంది. ఆలంపూర్ వరకు చివరి ఆయకట్టు దాకా కూడా నీళ్లు వెళ్లాల్సినప్పటికీ వెళ్లటం లేదు. దీనికోసం ఆల్టర్ నేట్ గా అంటే 40 కిలోమీటర్ల పైప్ లైన్ వేయాలని ఇంజనీర్లు చెబుతున్నారు. ఇది కూడా కాస్త ఖర్చు, భూసేకరణతో ముడి పడిన అంశంగా ఉంది. ఈ ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టినప్పటికీ కనీసం హాఫ్ కెపాసిటీ కూడా మనం వాడుకోలేకపోయాం. ఇక కాంగ్రెస్ వచ్చిన తర్వాత పూర్తిగా దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.” 

ప్రజలు క్షమించరు

“ఈ ప్రాంతంలో మేము వస్తుంటే ఎక్కడ చూసినా రైతులు నీళ్ల సమస్యనే చెబుతున్నారు. మక్క రైతులు పంట కొనుగోలు చేయలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న పంట కొనుగోళ్లు  చేపట్టాలని జిల్లా కలెక్టర్ కు సూచించాను.రైతుల సమస్య తీరాలంటే తుమ్మిళ్ల ప్రాజెక్ట్ పై ప్రభుత్వం శ్రద్ధ పెట్టాల్సి ఉంది. గతంలో ఆర్డీఎస్ అంశంపై కేసీఆర్ పాదయాత్ర చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే తుమ్మిళ్ల ప్రాజెక్ట్ కూడా వచ్చింది. కానీ దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. పన్నెండేళ్లైనా పూర్తి కాలేదంటే ప్రజలు క్షమించరు. ఈ ప్రభుత్వానికి సమస్య తీర్చేందుకు ఆరు నెలల సమయం ఇస్తాం. అప్పటికీ పట్టించుకోకపోతే మాత్రం మేము కూడా పాదయాత్ర చేయాల్సి ఉంటుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడి రైతులకు నీళ్లు ఇచ్చే ఆలోచన చేయాలి.”