మణుగూరు ఓసీ2 సందర్శన | (మణుగూరు)
మణుగూరు ఓసీ మైన్ ను ప్రైవేటు పరం చేసే కుట్ర చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. శుక్రవారం మణుగూరు మణుగూరు ఓసీ 2ను సందర్శించిన ఆమె కార్మికులతో సమావేశమయ్యారు. కార్మికులతో కలిసి క్యాంటీన్ లో టిఫిన్ చేసి టీ తాగారు. ఓసీ 2 వద్ద తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కార్మికుల ఉపాధి కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే సహించమన్నారు.
“మణుగూరు మనుగడను దెబ్బ తీసే విధంగా ఓసీ మైన్ ను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. ఈ మైన్ మీదనే మణుగూరు ప్రజానీకం ఆధారపడి ఉంది. మైన్ ను ప్రైవేట్ పరం చేస్తే మణుగూరు కు మనుగడ లేని పరిస్థితి వస్తుంది. సింగరేణి సీఎండీ గారే వచ్చి మూడేళ్లలో మైన్ క్లోజ్ చేస్తామని చెప్పారు. దీంతో మణుగూరు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పేరుతో ఒక వెయ్యి మందికి ఉపాధి ఇచ్చారు. కానీ ఈ మైన్ ను మాత్రం ప్రైవేట్ పరం చేయవద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. జీతంపై ఇన్ కం ట్యాక్స్, డిపెండెంట్ ఉద్యోగాలు, అలియాస్ అంశాలపై కార్మికుల పక్షాన హెచ్ఎంఎస్, జాగృతి పోరాటం చేస్తుంది.”












