అందరి జీవితాల్లో వెలుగులు నిండేలా సర్వోదయ తెలంగాణ నా గోల్
అందరికీ అధికారం అన్నప్పటి నుంచే నాకు కష్టాలు
మారోజు వీరన్న అనుచరుల మద్దతు ఎంతో శక్తిని ఇస్తుంది
-కల్వకుంట్ల కవిత
(తెలంగాణ జాగృతి కార్యాలయం, బంజారాహిల్స్)
కల్వకుంట్ల కవిత నేతృత్వంలో తెలంగాణ జాగృతి పెట్టబోయే పార్టీకి మారోజు వీరన్న అనుచరులు, సీపీయూఎస్ఐ, దళిత బహుజన రాజ్యాధికార సంస్థ మద్దతు పలికింది. బంజారాహిల్స్ లోని జాగృతి ప్రధాన కార్యాలయంలో సీపీయూఎస్ఐ కేంద్ర కమిటీ కార్యదర్శి కోదండం, రాష్ట్ర కార్యదర్శి వెంకన్న, దళిత బహుజన రాజ్యాధికార కన్వీనర్ గుడిపల్లి రవన్న, మారోజు వీరన్న సహచరులు కిషన్ నాయక్ సహా పలువురు నాయకులు కవితను కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ మారోజు వీరన్న అనుచరుల మద్దతు ఎంతో శక్తినిచ్చింది.
జయశంకర్ సార్ స్ఫూర్తితో..
మారోజు వీరన్న అభిమానుల ఈ మీటింగ్ లో ఎక్కువ మంది మహిళలు కనిపిస్తున్నారని,
ఇదే విధంగా రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలన్నారు. మూడు, నాలుగేళ్ల క్రితం మనం ఢిల్లీకి వెళ్లి ధర్నా చేసి మహిళా బిల్లు వచ్చేలా చేశామని గుర్తు చేశారు.
గతంలోనే ఈ బిల్లు ఆమోదం పొందిందని, కానీ మళ్లీ అదే బిల్లును పాస్ అంటూ మోసం చేస్తున్నారని విమర్శించారు. ఏ వర్గాలకు రావల్సిన ప్రయోజనాలను ఆ వర్గాలకు అందించకుండా ప్రతి దాంట్లో రాజకీయ ప్రయోజనం చూసుకుంటున్న పరిస్థితి ఉందన్నారు.
మనందరం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న సంగతి తెలిసిందేనని, అప్పుడు చాలా మంది బహుజన తెలంగాణ అంటూ జయశంకర్ సార్ వద్ద ప్రస్తావించారని తెలిపారు. జయశంకర్ సార్ జాగృతి సంస్థకు మార్గదర్శకులు, తాను ఆయనకు వీరాభిమానినన్నారు. బహుజన తెలంగాణ అనే అంశాన్ని ఆయన ముందు తాను కూడా ప్రస్తావించినట్లు వివరించారు. ఇదే పరిస్థితి భారత్ కు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంబేడ్కర్, గాంధీ ముందు కూడా వచ్చిందని జయశంకర్ చెప్పారన్నారు. భారత కుల వ్యవస్థలో నిరంతరం ఈ అంశం మన ముందుకు వస్తూనే ఉంటుందని అన్నారన్నారు. ఐతే ముందు మనం భౌగోళిక తెలంగాణ సాధించుకోవాలని, ఆ తర్వాత సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేయాలని జయశంకర్ సార్ చెప్పారని వెల్లడించారు.

పదవులకు నోచని కులాలెన్నో
తెలంగాణ వచ్చిన 12 ఏళ్లలో సామాజిక తెలంగాణ రాలేదు, ఏ వర్గానికి సంపూర్ణంగా న్యాయం జరగలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ చాలా కులాలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాయన్నారు. ఈ ప్రభుత్వం తప్పుల తడకగా చేసిన సర్వేలో కూడా చాలా కులాలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాయన్న విషయం స్పష్టంగా తెలిసిందన్నారు. గ్రామాల్లో వార్డు మెంబర్, సర్పంచ్ పదవులకు కూడా నోచుకోని కులాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. కులాలు బలంగా మారినప్పుడు మాత్రమే వారికి న్యాయం జరగుతుందని మారోజు వీరన్న నమ్మేవారని తెలిపారు. అందుకే ఆయన కులాల అస్తిత్వ పోరాటాలకు విప్లవ పోరాటాలను జత చేశారని చెప్పారు. రాష్ట్రంలో కుల సంఘాల ఏర్పాటుకు కర్త, కర్మ, క్రియ అన్ని ఆయనేనన్నారు. అన్ని కులాలకు న్యాయం జరగాలంటే కుల సంఘాలు బలపడాలంటూ కుల సంఘాలను మారోజు వీరన్న ఏర్పాటు చేశారని వివరించారు. ఆయన మన ముందు పెట్టిన బాధ్యతను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందని సూచించారు. తెలంగాణలో అందరికీ ప్రాధాన్యం ఉండాలని తాము అనుకున్నామని, తాను ఎప్పుడైతే అందరికీ అధికారం కావాలని మాట్లాడటం మొదలుపెట్టానో అప్పటి నుంచే తనకు కష్టాలు మొదలయ్యాయని కవిత చెప్పారు. కానీ ఎన్ని కష్టాలు వస్తే తనలో అంత కసి పెరిగిందని చెప్పారు. ప్రతి కష్టాన్ని ఒక పాఠంగా భావించానని వెల్లడించారు. కచ్చితంగా తెలంగాణలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.
మాజీ మావోయిస్టుల కోసం భూ పోరాటం
ఈ నెల 25 న తాము నూతన రాజకీయ శక్తిగా వస్తున్నామని, తెలంగాణ ప్రాంతీయ తత్వాన్ని, సామాజిక కోణాన్ని రంగరించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. మారోజు వీరన్న లాంటి గొప్ప వ్యక్తి ఫాలోవర్స్ తమకు మద్దతివ్వటం చాలా సంతోషంగా ఉందని, పార్టీ పెడుతున్న సందర్భంగా మీరిస్తున్న ధైర్యం మామూలుది కాదని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దాదాపు లక్ష మంది మాజీ మావోయిస్టులు టీఆర్ఎస్ లో చేరారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ బలోపేతం కావటానికి వాళ్లంతా ఒక చోదక శక్తిగా మారారని కవిత తెలిపారు. కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వాళ్లెవరికీ కూడా న్యాయం జరగలేదని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులు, అమర వీరుల కుటుంబాల కోసం ఏ విధంగా భూపోరాటం చేస్తున్నామో మాజీ మావోయిస్టుల కోసం కూడా అదే విధంగా పోరాటం చేస్తామని ప్రకటించారు. తమ పోరాటానికి ఇప్పుడు మారోజు వీరన్న అనుచరులు తోడయ్యారు.. ఇక తమని ఆపే శక్తి ఎవరికీ లేదని ధీమా వ్యక్తం చేశారు. మారోజు వీరన్న ఫాలోవర్స్ అంటే ఎంతో నైతికతో ఉంటారని, తెలంగాణ ప్రజల కోసం మనమందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. సర్వోదయ తెలంగాణ సాధించటమే తన లక్ష్యమని కవిత స్పష్టం చేశారు. మీరిస్తున్న నైతిక ధైర్యంతో లక్ష్యం కోసం ముందుకు వెళ్తానని చెప్పారు.








