పత్తి విత్తన రైతులతో సమావేశం | (గద్వాల)
బకాసురుడిపై భీముడి మాదిరిగా కొట్లాడిన నేత ఇప్పుడు నడిగడ్డకు కావాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. విత్తన పత్తి రైతులకు న్యాయం జరగాలంటూ నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రంజిత్ 12 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారని, అతన్ని ఎన్నికల్లో గెలిపించుకుంటే ప్రజలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో విత్తన పత్తి రైతులతో సోమవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో పాల్గొని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.


పోరాటపటిమ కావాలి
“ఎత్తిన పిడికిలి దించకుండా పోరాటం చేయటమంటే సామాన్యమైన విషయం కాదు. ఇది అందరి వల్ల కాదు.
దమ్ము, ధైర్యం, పట్టుదల, నీతి, నిజాయితీ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఆ ధైర్యం, పట్టుదల నీతి, నిజాయితీ నడిగడ్డ పోరాట సమితికి, జాగృతికి ఉంది. అందుకే ఇక్కడి సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. సమాజం ఒక అద్ధం లాంటిది. నడిగడ్డ పరిస్థితి ప్రభుత్వానికి అర్థమయ్యేలా అద్దం పెట్టి చూపిస్తున్నాం. గద్వాల్ అంటేనే ఒకటి, రెండు పేర్లు మాత్రమే ఎప్పుడు వింటాం. కానీ ఇక్కడకు వచ్చాక వాళ్లు ప్రజలకు ఎంత భయంకరమైన అన్యాయం చేశారో తెలుస్తోంది. ఈ ప్రాంతంలో రోడ్లు బాగాలేవు. ఒకటి రెండు రోజుల్లో బాగు చేస్తారని అనుకున్నా. కానీ ఏళ్లకు ఏళ్లుగా అలాగే ఉన్నాయంట. దాని వెనుక కూడా కుట్ర ఉంది.
రోడ్లు బాగుంటే ప్రజలు వేరే చోటుకు వెళ్లి చదువుకుని సోయికి వస్తారు. అప్పుడు వీళ్ల అన్యాయాలను ప్రశ్నిస్తూ ఉంటారు. అందుకే రోడ్లు బాగుచేయటం లేదు. పైగా ముఖ్యమంత్రి ఫొటోలు వేసుకొని మరీ అవినీతి చేస్తున్నారు.
ఆసియా ఖండంలోనే ఇక్కడ అతి తక్కువ అక్షరాస్యత ఉంది. ఇంకా ఇలాగే చూస్తూ ఊరుకుందామా? ఇక ఏ మాత్రం భరించవద్దు. పంతం పట్టి మరీ మనం చదవులో నంబర్ వన్ కావాల్సి ఉంది. రాజకీయంగా మార్పు సాధించినప్పుడు మాత్రమే అవన్నీ సాధ్యమవుతాయి.
ఇప్పుడు ఉన్న నాయకులు దొంగలతో కలిసి ఉన్నారు. అందుకే న్యాయం జరగటం లేదు. ఇక్కడ ఏ వ్యాపారం చెయ్యాలన్నా ఆ కుటుంబానికి వాటాలు కావాలి. అందుకే వాళ్లు అధికారం చెలాయిస్తున్నారు. వాళ్లకు ఇవ్వన్నీ రాకుండా చేయాలంటే మనం రాజకీయంగా ఆలోచించాలి.
నడిగడ్డ ఎవరి అడ్డా కాదని నిరూపించండి. తెలంగాణ ఉద్యమంలో కూడా రాజకీయపరమైన అంశాలపై కొట్లాడినం. రాజకీయంగా నాయకులను మార్చినప్పుడు మాత్రమే రోడ్లు, ఉద్యోగాలు, ఉపాధి వస్తుంది. అలాంటి నాయకుడు రంజిత్ కుమార్ రూపంలో మీ ముందు ఉన్నాడు. ఆయనను గెలిపిస్తారా? లేదంటే మళ్లీ మనవి బానిస బతుకులు అయ్యే పరిస్థితి ఉంటుంది. నడిగడ్డ ప్రాంతం చదువులో వెనుకబడి ఉంది. విద్య విషయంలో స్కూళ్లు, టీచర్లు వచ్చేలా పోరాటం చేద్దాం. “

పత్తి రైతుకు న్యాయం చెయ్యాలి
“అయిజలో పత్తి విత్తన రైతులకు గతంలో రూ. 560 అని చెప్పి ఇప్పుడు 450 ఇస్తామంటున్నారు. దీనిని అడిగే వాళ్లు కచ్చితంగా మనకు కావాలి. ప్రపంచంలో ఏ వస్తువుకు అయినా ఉత్పత్తి చేసిన వాళ్లే ధరను నిర్ణయిస్తారు. కానీ ఒక్క రైతు మాత్రమే తాను పండించిన పంటకు ధర నిర్ణయించుకోలేని పరిస్థితి ఉంది. పత్తి విత్తన రైతులు తాము పండించిన విత్తనాలకు వెంటనే టెస్ట్ జరిగే పరిస్థితి ఉండాలి. దీనికి శాశ్వత పరిష్కారం కావాలంటే గవర్నమెంట్ నుంచే టెస్టింగ్ ఉండాలి. కంపెనీల నుంచి రైతులకు డైరెక్ట్ గా అగ్రిమెంట్ రావాలి.”








