కవితతో చందా లింగయ్య దొర భేటీ

జనగణనలో ఆదివాసీల మతం కోసం ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలి

ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం పాటు పడుతామని హామీ

(హైదరాబాద్)

కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల హక్కులను పరిరక్షించేందుకు ఆల్ ఇండియా ఆదివాసీ  రాజ్యాంగ హక్కులు, సాంస్కృతిక పరిరక్షణ జేఏసీ చేస్తున్న పోరాటానికి తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల హక్కులను హరిస్తోందని, పెసా చట్టానికి తూట్లు పొడిచి.. రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూళ్లలోని రక్షణలను తొలగిస్తోందని ఆరోపించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో ఆల్ ఇండియా ఆదివాసీ కానిస్ట్యూషనల్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ జేఏసీ ఆల్ ఇండియా చైర్మన్, ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలతో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను జాగృతి అధ్యక్షురాలికి చంద లింగయ్య దొర వివరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..పోలవరం ప్రాజెక్టులో 3 లక్షల మంది ఆదివాసీలను అడవి నుంచి దూరం చేస్తున్నారని.. తిరిగి వారికి అడవిలో అన్ని సౌకర్యాలతో కూడిన పునరావాసం కల్పించడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణనలో మతం కేటగిరిలో ఆదివాసీ అనే కాలమ్ పెట్టలేదు.. దీంతో ఆదివాసీలు తాము ఆదివాసీలమని సగర్వంగా చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది.. ఇది దేశ మూలవాసులైన ఆదివాసీల సంస్కృతిని అవమానించడమేనని ధ్వజమెత్తారు. జనగణనలో తమది ఆదివాసీ మతం అని చెప్పుకునేలా ప్రత్యేక కాలమ్ పెట్టాలని, ఆదివాసీల భాష ‘‘కోయతూర్’’ ను భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ చేర్చాలని డిమాండ్ చేశారు.

దేశంలోని 12 కోట్ల మంది ఆదివాసీలు నిజమైన భారత దేశ సంస్కృతికి ప్రతినిధులని.. వారి గౌరవాన్ని కాపాడేలా తాము ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఆదివాసీ జేఏసీ ముఖ్య నాయకులు పాడూరి శ్రీనివాస్, పాయం సత్యనారాయణ, మాడవి నర్సింగరావు, వట్టం నారాయణ దొర, రమణాల లక్ష్మయ్య, వజ్జ నర్సింహరావు, కబ్బాక శ్రావణ్ కుమార్, కుర్సంగ వేణు, వరియ శ్రీనివాస్, షడమాకి సంజీవ్, ఆత్రం పైకాజీ, పోదెం భార్గవి పాల్గోన్నారు.