తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం మేడారంలో, సమ్మక్క, సారాలమ్మను దర్శించుకున్నారు. మేడారంలో తన ఎత్తు బంగారం మొక్కు చెల్లించుకొని వన దేవతలు సమ్మక్క, సారలమ్మతో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజు లను దర్శించుకున్నారు. సమ్మక్క, సారలమ్మలను దర్షించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు.  

తెలంగాణ ప్రజలు బాగుండాలని సమ్మక్క, సారలమ్మలను కోరుకున్నానని కవిత చెప్పారు. కాకతీయుల వంటి రాజులతో కొట్లాడిన వనదేవతలు సమ్మక్క, సారలమ్మలని తెలిపారు. వారి జాతి కోసం నిలబడి కొట్లాడిన వీరవనితలని పేర్కొన్నారు. గోవింద రాజు, పడిగిద్ద రాజుల వంశంలో గొప్ప సైనికులన్నారు. వారి స్ఫూర్తితోనే మేము తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తామని వివరించారు. 

తెలంగాణ వచ్చిన 12 ఏళ్ల తర్వాత కూడా నీళ్లు, నిధులు, నియామకాలు అందని పరిస్థితి ఉందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం ఇప్పటికీ అందరికీ దక్కలేదన్నారు. ఈ పరిస్థితి పోయేలా జాగృతి తరఫున మా వంతు కృషి చేస్తామని ప్రకటించారు.

అంతకుముందు మేడారం దర్శనానికి వెళ్తూ ములుగు సమీపంలోని గట్టమ్మ తల్లికి  కల్వకుంట్ల కవిత పూజలు చేశారు.