మిలియన్ మార్చ్ ను తలపించేలా భూపోరాటం

జులై 2 న ఉప్పల్ భగాయల్ లో పెద్ద ఎత్తున ఆందోళన

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి ప్రకటన చేయకపోవటం దుర్మార్గం

ఆగస్ట్ 6 లోగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలి

 -టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

(తెలంగాణ రక్షణ సేన కార్యాలయం, బంజారాహిల్స్)

తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలును డిమాండ్ చేస్తూ జులై 2 నుంచి మిలియన్ మార్చ్ ను తలపించే ఉద్యమం నిర్వహించనున్నట్లు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన వారిని మది నిండా, ఆర్తితో గుర్తు చేసుకుంటున్నామన్నారు. కచ్చితంగా వారందరి ఋణం తీర్చుకుంటామని మాట ఇచ్చారు. ఆస్తులు, ఉద్యోగాలు పొగొట్టుకొని మరో స్వాతంత్ర్య పోరాటం మాదిరిగా తెలంగాణ ఉద్యమం చేసిన వారందరికీ సెల్యూట్ అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఒక దిక్సూచిగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ను ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలని కవిత చెప్పారు. తెలంగాణ సాధించుకున్న 12 ఏళ్ల తర్వాత కూడా మనం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోకపోవటం అన్యాయమని మండిపడ్డారు. తెలంగాణ జాగృతి తరఫున నాలుగు జిల్లాల్లో ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసి గౌరవించుకున్నామని గుర్తు చేశారు. కానీ హైదరాబాద్ లో ఆయన విగ్రహం ఉండాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. అందుకే నిన్నటి రోజున విగ్రహం పెట్టాలంటూ ముఖ్యమంత్రికి లేఖ రాశామని తెలిపారు. 

జయశంకర్ సార్ విగ్రహం కోసం 2014 నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నామని కవిత వివరించారు. 

2017 లో అప్పటి మున్సిపల్ శాఖకు కూడా లేఖ రాశామని, కానీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక పునాదులు వేసిన జయశంకర్ సార్ విగ్రహం రాష్ట్ర రాజధానిలో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. 

తమకు అవకాశం ఇస్తే విగ్రహ ఏర్పాటు ఖర్చుతో పాటు లైఫ్ టైమ్ మెయింటెనెన్స్ చేస్తామని వెల్లడించారు.

లేదంటే ప్రభుత్వమే అంతకన్నా గొప్పగా చేస్తామంటే కూడా చేయాలని కోరుతున్నామని సూచించారు. ఆగస్ట్ 6 న జయశంకర్ సార్ జయంతి ఉందని, ఆ లోపు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

మున్సిపల్ శాఖకు తాము ఇచ్చిన లేఖను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

భావితరాలకు పాఠాలు కావాలి

 తెలంగాణ ఉద్యమం అనేది మరో స్వాతంత్ర్య పోరాటం మాదిరిగా జరిగిందని కల్వకుంట్ల కవిత గుర్తు చేశారు. ఇప్పుడున్న పిల్లలకు ఈ ఉద్యమం గురించి పూర్తిగా తెలియదని, వారంతా మన చరిత్రను తెలుసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఎంతో మంది ప్రాణత్యాగాలు, ఉద్యమాలు చేసి ఈ రాష్ట్రాన్ని సాధించారని వివరించారు. 

జూన్ 2 అంటే ఒక హాలిడే కాదు.. వివక్ష లేకుండా, మన యాసను మనం మాట్లాడుకునేలా చేసిన గొప్ప రోజని తెలిపారు. తెలంగాణ పౌరులు సెకండ్ గ్రేడ్ పౌరులు కాదని, ఎంతో స్వేచ్ఛగా ఉండే అవకాశం వచ్చిన రోజన్నారు. అందుకే మన చరిత్రను కచ్చితంగా ఇప్పటి పిల్లలంతా కూడా తెలుసుకోవాలన్నారు. ఆగస్ట్ 15 న ఎంత గొప్పగా వేడుకలు జరుపుకుంటామో…జూన్ 2 ను కూడా అంతే గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాలని సూచించారు. 

జూన్ 2 వేడుకల్లో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేస్తాడని భావించామని కవిత చెప్పారు. కానీ ఆ అంశాన్ని ఆయన మాట్లాడలేదని, కేకే కమిటీ విధివిధానాలను కూడా చెప్పకపోవటం దుర్మార్గమని మండి పడ్డారు. ఈ ప్రభుత్వం ఇవ్వాళ స్పష్టమైన ప్రకటన చేయకపోతే పెద్ద ఎత్తున భూపోరాటం చేస్తామని నిన్నటి రోజునే చెప్పామని గుర్తు చేశారు. 

జులై 2 న ఉప్పల్ భగాయత్ లో అతి పెద్ద భూపోరాటం చేయబోతున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి పార్టీలతో సంబంధం లేదని, అందరూ పాల్గొనాలని కోరారు. 

మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు, న్యాయవాదులు, పత్రిక మిత్రులు సహా ఊరికి ఒక్కరైనా సద్ది కట్టుకొని రావాలని పిలుపునిచ్చారు. మిలియన్ మార్చ్ ను గుర్తు చేసే విధంగా ఈ ఉద్యమాన్ని చేద్దామని చెప్పారు. అదే విధంగా తెలంగాణ ఉద్యమకారులను అమరవీరులను ఆదుకొని గౌరవించుకోవల్సిన బాధ్యత మన మీద ఉందని కవిత తెలిపారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చాక అమరవీరుల కుటుంబాలకు రూ. కోటి ఇస్తామని పునరుద్ఝాటించారు. ఉద్యమకారులను తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తామని కవిత ప్రకటించారు.