కవిత పార్టీ ప్రకటన సభకు అట్టహాసంగా ఏర్పాట్లు

సర్వాంగ సుందరంగా ముస్తాబైన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రాంగణం

గన్ పార్క్ లో అమరవీరులకు నివాళులర్పించి మునీరాబాద్ బయల్దేరనున్న కవిత

ఉదయం 10 గంటలకు పార్టీ పేరు ప్రకటన, జెండా ఆవిష్కరణ

33 జిల్లాల నుంచి తరలిరానున్న 50 వేల మంది కార్యకర్తలు

(హైదరాబాద్) :

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధమైంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ (ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రాంగణం) తెలంగాణ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించడానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రెండు దశాబ్దాల క్రితం తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో సంస్కృతిక విప్లవానికి ఊతకర్రగా నిలుస్తూ తెలంగాణ జాగృతిని స్థాపించిన కల్వకుంట్ల కవిత 20 ఏళ్ల తన ప్రజా జీవితంలో ఎన్నో మైలు రాళ్లను చేరుకున్నారు.. మరెన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. మునీరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్ తో పాటు దానిని ఆనుకుని ఉన్న 20 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ సభా ప్రాంగణం నుంచి కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. ఈ సభ కోసం తెలంగాణ నలు మూలల నుంచి సుమారు 50 వేల మంది రానున్నట్లు అంచనా.

• శనివారం ఉదయం 7.30 గంటలకు కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్ లోని తన నివాసం నుంచి గన్ పార్కులోని అమరవీరుల స్తూపానికి ర్యాలీగా బయల్దేరుతారు.
• ఉదయం 8.15 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు.
• ఉదయం 8.25 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద నుంచి బయల్దేరుతారు.
• ఉదయం 9.30 గంటలకు మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ హాల్ మెయిన్ గేట్ వద్దకు చేరుకుంటారు.
• ఉదయం 10 గంటలకు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరును ప్రకటించి, జెండాను ఆవిష్కరిస్తారు.
• ఉదయం 10.05 గంటలకు ప్రసంగం ప్రారంభిస్తారు..సుమారు గంట 15 నిమిషాల నుంచి గంటన్నర పాటు కవిత ప్రసంగించే అవకాశం ఉంది.

సభా ప్రాంగణం పేరు : ప్రొఫెసర్ జయశంకర్ సార్ సభా ప్రాంగణం
ప్రధాన ద్వారానికి ప్రజాకవి కాళోజీ నారాయణ రావు ద్వారంగా, కవిత వేదిక వద్దకు వచ్చే ద్వారం పేరును రాణి రుద్రమ దేవి ద్వారంగా నిర్ణయించారు. ఆహుతులు వచ్చే ద్వారాలకు
మారోజు వీరన్న ద్వారం, చాకలి ఐలమ్మ ద్వారంగా పేర్లు పెట్టారు. దాంతో పాటు మగవారి కోసం ఏర్పాటు చేసిన భోజన శాలకు సురవరం ప్రతాపరెడ్డి భోజనశాల అని, మహిళల కోసం ఏర్పాటు చేసిన భోజనశాలకు సమ్మక్క సారాలమ్మ, మీడియా ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన భోజనశాలకు షోయబుల్లా ఖాన్ పేరు పెట్టారు.

34 రకాల తెలంగాణ రుచులతో వంటకాలు

నూతన పార్టీ ప్రకటన అనంతరం పార్టీ కార్యకర్తలు, అతిథులకు తెలంగాణ రుచులతో భోజనాలు వడ్డించనున్నారు. మధ్యాహ్న భోజనం కోసం 34 రకాల వంటకాలతో మెనూ సిద్ధం చేశారు. నాన్ వెజ్ లో..తలకాయ కూర, బోటీ ఫ్రై, తెలంగాణ మటన్ కర్రీ, నాటు కోడి పులుసు, బొమ్మిడాయల పులుసు, హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ, మిర్చి కా సాలాన్, ఎగ్ ఇగురు వడ్డించనున్నారు. వెజిటేరియల్ లో బగారా బైంగన్ మసాలా కర్రీ, కందగడ్డ ఫ్రై, పాలకూర, మామిడి పప్పు, ఆలూ టామాటా, చామగడ్డ పులుసు, కట్ చారు సిద్ధం చేయనున్నారు.
తెలంగాణ ప్రత్యేక వంటకాలుగా పేరుగాంచిన మక్కగారెలు, జొన్నరొట్టె, సర్వపిండి, బూరెలు, అరిసెలను కూడా మెనులో చేర్చారు. వీటితో పాటు బగారా రైస్, వైట్ రైస్, సాంబార్, రోటిపచ్చడి, దోస, ఆవకాయ, మిర్చిబజ్జి, పచ్చి పులుసు, పాపడ్, పెరుగు, రైతా కూడా ఉండనున్నాయి. మజ్జిగ, రాగి అంబలి కూడా పార్టీ అవిర్భావ సభలో అందుబాటులో ఉంటాయి. ఇక డిజర్ట్ లో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్, షాహితుక్డా, జిలేబీ పెట్టనున్నారు.