-కల్వకుంట్ల కవిత
సైదాబాద్ లోని ఖాజాబాగ్ కాలనీ బస్తీ సందర్శన
40 ఏండ్లుగా ఇండ్ల పట్టాల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడటం పాలకుల అమానుషత్వానికి నిదర్శనమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సైదాబాద్ లోని ఖాజా బాగ్ కాలనీ బస్తీని సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాకముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా ఈ బస్తీ వాసుల పరిస్థితి అలాగే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

” ఈ ప్రాంత ప్రజలు 40 ఏండ్లుగా ఇళ్ల పట్టాలు కావాలని అడుగుతున్నారు. కానీ ఇప్పటి వరకు మనకు పట్టాలు రాలేదు. బీఆర్ఎస్ పదేళ్లు, కాంగ్రెస్ రెండేళ్లుగా ఉన్నా బస్తీవాసుల పరిస్థితులు మారలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్లమ్ డెవలప్ మెంట్ ప్రొగ్రామ్ తీసుకుంటామని ఎన్నికలకు ముందు చెప్పింది. కానీ ఈ రెండేళ్లలో ఒక్కసారి కూడా సీఎం రేవంత్ రెడ్డి దాని గురించి మాట్లాడలేదు. ఆయనకు ఈ విషయం గుర్తుకు వచ్చేలా మనం పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవాలి. 15 వేల మంది ఉన్న ఈ ప్రాంతంలో స్కూల్, హాస్పిటల్, డ్రైనేజీ లేకపోవటం దారుణం.”
” గ్లోబల్ సమ్మిట్ అని ప్రపంచ దేశాల వారిని హైదరాబాద్ కు తెచ్చి గొప్పలు పోయారు. కానీ వాళ్లను ఇక్కడి బస్తీలకు తెచ్చి చూపిస్తే వాస్తవం ఎలా ఉందో తెలిసేది. బస్తీ వాసులకు పట్టాలు వచ్చే విధంగా ముందు ప్రయత్నం చేద్దాం. అది కొంచెం సమయం పట్టినా సరే గట్టిగా అడుగుదాం. అదే విధంగా బస్తీ దవాఖానా కావాలని కూడా ప్రభుత్వాన్ని కోరుదాం. ఈ కాలనీ కోసం ప్రత్యేకంగా స్కూల్ ఏర్పాటు చేయాలి. కష్టపడి పనిచేసుకునే ఇక్కడి ప్రజలకు కనీసం బస్ సౌకర్యం కూడా లేదు. ఇక్కడి వారంతా కూలి చేసుకుని దినం గడుపుకునే వారే. పనికి వెళ్లేందుకు ఆటోలో ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఫ్రీ బస్ తోని ఇక్కడి ప్రజలకు అసలు ప్రయోజనం లేదు. కచ్చితంగా బస్ సౌకర్యం కాల్పించాలి. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే విద్యార్థుల కోసం జాబ్ మేళా నిర్వహిస్తాం. ఎన్నికలప్పుడే రాజకీయ పార్టీలకు బస్తీవాసులు గుర్తుకు వస్తారు. ఎవరు డబ్బులిచ్చినా సరే తీసుకోవాలి. కానీ అభివృద్ధి చేసే వాళ్లకే ఓటు వేయాలి. ఓట్లు లేనప్పుడు మీ మధ్య తిరిగేటోళ్లే మీ కోసం పనిచేసే వాళ్లని గుర్తించండి. జాగృతి ఇప్పుడు ఓట్లు లేకపోయినా సరే రాష్ట్రమంతా తిరుగుతున్నది. తెలంగాణ వచ్చాక ఏమి జరిగింది.. ఏమి జరగాల్సి ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజల సమస్యలను కలెక్టర్లు, అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. మేము అడుగుతున్నాం కాబట్టే అడుగు ముందుకు పడుతున్నది. ఈ సీఎం ఆడవాళ్లందరికీ రూ. 2500 ఇస్తానని చెప్పాడు. తులం బంగారం ఇస్తా అన్నాడు. దాని గురించి కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి. నేను మీ తరఫున ప్రభుత్వాన్ని ప్రతిరోజు అడుగుతూనే ఉన్నా. మీకు పట్టాలు వచ్చేలా మొదటి ప్రాధాన్యంగా మేము పోరాటం చేస్తాం. “
“నేను ఇప్పుడు అధికారంలో లేను. బీఆర్ఎస్ లోనూ లేను. నన్ను బీఆర్ఎస్ నుంచి నన్ను బయటకు పంపారు. అయిన సరే మీరు ఉన్నారన్న ధైర్యంతో నేను మీ ముందుకు వచ్చాను.హైదరాబాద్ మహానగరంలో గ్రామాల కన్నా దారుణ పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకంగా డ్రైనేజీ వ్యవస్థ ఆధ్వాన్నంగా ఉంది. గౌలిపుర లో నీళ్లు ఆయిల్ మాదిరిగానే ఉన్నాయి. హైదరాబాద్ లో ఇలాంటి పరిస్థితులు ఉండటం మనందరికీ సిగ్గుచేటు. మంచి నీళ్లు కూడా మురుగు నీళ్లతో కలిసి ఉన్న పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా నీళ్లు, డ్రైనేజీ, స్కూల్స్, హాస్పిటల్స్ అనే సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించేందుకు అవసరమైతే జాగృతి తరపున ధర్నాలు చేస్తాం.”








