రాష్ట్ర ఇజ్జత్ తీస్తున్న సీఎం రేవంత్
తెలంగాణపై పెత్తనం కోసం పక్క రాష్ట్రం కుట్ర
కార్మికులకు కనీస అవసరాలు తీర్చకుండా ప్రభుత్వం, ఆఫీసర్లు ఇబ్బంది పెడుతున్నారు
సింగరేణిని కాపాడేందుకు కేంద్రం ఎక్కువ బొగ్గు బ్లాకులు కేటాయించాలి
-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
(తెలంగాణ రక్షణసేన, గోదావరిఖని)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థత కారణంగానే మన రాష్ట్రంపై పెత్తనం కోసం పక్క రాష్ట్రం నాయకులు కుట్ర చేస్తున్నాయని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి బేలగా మాట్లాడడం రాష్ట్ర ప్రజల్లో అభద్రతను పెంచుతున్నదని చెప్పారు. టీఆర్ఎస్ సింగరేణి బాయిబాటలో భాగంగా బుధవారం గోదావరిఖని 11 ఇంక్లైన్ కార్మికులతో కవిత గేట్ మీటింగ్ నిర్వహించారు. కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఇజ్జత్ తీయటమే పనిగా పెట్టుకున్నాడని కవిత అన్నారు.
ఢిల్లీకి అప్పు కోసం పోతే చెప్పులు ఎత్తుకుపోయే వాళ్లను చూసినట్లు చూస్తున్నారని అంటాడని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి తన ఫోన్ ఎత్తటం లేదని చెబుతాడని.. మొన్నటికి మొన్న నేను హిట్లర్ లాంటి వాడినంటూ గొప్పగా చెప్పుకుంటున్నాడని తెలిపారు. అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత బేలగా మాట్లాడుతాడా? ఆయన బేల మాటల కారణంగానే ఆంధ్రాలో ఉండే నాయకులు మనపై పెత్తనం చెలాయించేందుకు మళ్లీ కుట్రలు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు చేస్తే 11రోజులు అన్నం తినలేదన్న పవన్ కళ్యాణ్ మళ్లీ తెలంగాణలో రాజకీయాలు చేస్తాడంట.. వాళ్లను మనం అడ్డుకుంటున్నామంట.. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ పవన్ కళ్యాణ్ వారంలో మూడు రోజులు హైదరాబాద్ లోనే ఉంటున్నారని వివరించారు. అందుకే మన సంపద మనం కాపాడుకునేందుకు మనమంతా మేలుకోవాలని కవిత పిలుపునిచ్చారు.
హామీలు మరిచిన కాంగ్రెస్
కార్మికులను కలిసేందుకు వస్తే గేట్లు బంద్ పెట్టి అడ్డుకుంటున్నారని కవిత అన్నారు. ప్రతిపక్ష పార్టీలను సింగరేణి కార్మికులు కలవద్దా..? కార్మికులకు ఏ పార్టీ వారితోనైనా మాట్లాడే హక్కు ఉందని చెప్పాారు. కానీ సింగరేణి యాజమాన్యం పోలీసులను తీసుకొచ్చి తమని అడ్డుకుంటున్నారని విమర్శించారు. అసలు సింగరేణి క్యాంపస్ లోకి పోలీసులే రావద్దని, కానీ వాళ్లను తీసుకొచ్చారంటే వీళ్లు ఎంత తప్పు చేసి ఉంటారోనని చెప్పారు. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి, రాహుల్ గాంధీ కూడా ఎన్నికలకు ముందు సింగరేణి కార్మికులతో మీటింగలు పెట్టలేదా అని ప్రశ్నించారు. ఈ నేతల మాటలు నమ్మి కోల్ బెల్ట్ ప్రాంతంలో కాంగ్రెస్ ను గెలిపించారని, కానీ గెలిచాక గ్లౌజ్ లు, షూస్, మెషీన్లు ఏదీ నాణ్యత లేకుండా అయిపోయిందన్నారు. గనుల్లోకి వెళ్లే కార్మికులకు కనీసం ఆక్సిజన్ కూడా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఏమైనా అడిగితే గత ప్రభుత్వం మీద నెట్టేసి డబ్బులు లేవు అంటున్నారన్నారు. సింగరేణి కార్మికులకు మాట ఇచ్చే ముందు ఇవ్వన్నీ మీకు తెలియవా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కనీసం నీళ్లు, గాలి ఇచ్చే సోయి కూడా లేదని, ప్రాథమిక సౌకర్యాలు కూడా ఇవ్వటం లేదని దుయ్యబట్టారు. సింగరేణిలో రాజకీయ జోక్యం ఎక్కువ కావటంతోనే చిన్న చిన్న సౌకర్యాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని కవిత ఆరోపించారు. వీటన్నింటినీ ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. తనది ప్రశ్నించే తత్వమని.. తాను 20 ఏళ్లుగా సింగరేణి కార్మికులతో కలిసి పనిచేస్తున్నానని వివరించారు. తెలంగాణ ఉద్యమంలో అగ్గిరాజేసి రాష్ట్రం సాధించుకున్నామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కూడా కేసీఆర్ తో మాట్లాడి కార్మికుల కోసం పనిచేశానని గుర్తు చేశారు. ముఖ్యంగా డిపెండెంట్ ఉద్యోగాల కోసం తాను చేసిన పోరాటంతో 19 వేల ఉద్యోగాలు నడుచుకుంటూ వచ్చాయని వెల్లడించారు. మహిళలకు సింగరేణిలో ఉద్యోగాలు వచ్చేలా చేశామని తెలిపారు.

ఆఫీసర్లు మానవత్వంతో ఉండాలి
నేను ఎప్పటికీ సింగరేణి బిడ్డనేనని.. ఎక్కడున్నా కార్మికుల కోసమే కొట్లాడుతానని హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికులను ఆఫీసర్లు ఇబ్బంది పెడుతుండటం చాలా బాధాకరమన్నారు. ఆఫీసర్లకే తమ హక్కులు కాపాడుకునేందుకు యూనియన్లు ఉన్నాయని.. అలాంటిది కార్మికులకు తమ హక్కులు కాపాడుకోవటానికి యూనియన్లు ఉండొద్దా అని కవిత ప్రశ్నించారు. కార్మికులను ఇబ్బంది పెట్టవద్దని…చిన్న వాటికే మెమోలు అంటూ పరేషాన్ చేయవద్దని రిక్వెస్ట్ చేశారు. వన్ విజన్ అన్నట్లుగా ఉండాలి.. కానీ ఇక్కడ రెండు విజన్లు అన్నట్లుగా పనిచేస్తున్నారని కవిత తెలిపారు. ఆఫీసర్ల కారణంగా మైన్ లో కార్మికులు సంతోషంగా లేరని.. ఆఫీసర్లు మానవీయకోణంలో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. డిజీల్ కుంభకోణంలో పైన ఉన్న పెద్దవాళ్లు చిన్న ఆఫీసర్లను ఇబ్బంది పెడితే రియాజ్, తానే వాళ్ల హక్కుల కోసం పోరాటం చేశామని గుర్తు చేశారు. కార్మికుల హక్కులు, వారికిచ్చే సౌకర్యాలు, భద్రత కోసం ఆఫీసర్లే ఆ పై అధికారులతో కొట్లాడాలని పిలుపునిచ్చారు. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్లు మనల్ని రానివ్వొద్దని ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కానీ తల్లి కాంగ్రెస్ తోనే పోరాటం చేసి…తెలంగాణను సాధించుకున్నాం.. ఇప్పుడున్న ఈ పిల్ల కాంగ్రెస్ ఎంత అన్నారు.
మేమున్నాం అండగా..
కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ సింగరేణికి కొత్త బ్లాకులు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.
మూసుకుపోతున్న అండర్ గ్రౌండ్ మైనింగ్ ను ఈ రాష్ట్ర ప్రభుత్వం తెరవాలని కోరారు. బొగ్గు బ్లాకుల్లో షాప్ట్ వేస్తే అవి ఇంకొక 50 ఏళ్ల వరకు నడుస్తాయన్నారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటే కుదరదని, అండర్ గ్రౌండ్ మైనింగ్ చేయాల్సిందేనన్నారు. అండర్ గ్రౌండ్ మైనింగ్ కారణంగా పర్యావరణ పరిరక్షణతో పాటు వేలమందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు. సింగరేణి కార్మికుల కష్టాలపై మాట్లాడాల్సిన ఏఐటీయూసీ మౌనంగా ఉందని ఆరోపించారు.
సింగరేణి డబ్బులతో నిర్మించిన మెడికల్ కాలేజీలో 25 శాతం సీట్లు కార్మికుల పిల్లలకు ఇవ్వాలన్నారు. కానీ ఐదు శాతం కూడా ఇవ్వటం లేదని.. దీనిపై ఏఐటీయూసీ నేతలు మాట్లాడటం లేదని విమర్శించారు. సింగరేణి కార్మికుల పిల్లలు చదువుకునేందుకు మంచి స్కూళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ హెచ్ఎంఎస్ కార్మికులకు అండగా ఉంటుందని, సింగరేణిని కాపాడడమే తమ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. ఆఫీసర్లు ఇబ్బంది పెడితే ఒక్క ఫోన్ చేయండి.. తాము వచ్చి పోరాటం చేస్తామని కవిత హామీ ఇచ్చారు.








