సెంట్రింగ్ కార్మికులతో వెంటనే చర్చలు జరపాలి
రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే ధర్నాలో కూర్చుంట
గుంపు మేస్త్రీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలు ఆగమవుతున్నాయి
గుంపు మేస్త్రీ హఠావో….తెలంగాణ బచావో
-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
ఇందిరాపార్క్ వద్ద సెంట్రింగ్ కార్మికుల ధర్నాలో పాల్గొని వారికి మద్దతు తెలిపిన కవిత
(ఇందిరాపార్క్, హైదరాబాద్)
సెంట్రింగ్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించి ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండు చేశారు.
హైదరాబాద్ లో అద్దాల మేడలు కనిపిస్తున్నాయంటే దానిలో సెంట్రింగ్ కార్మికుల కృషి ఎంతో ఉందని చెప్పారు.
ఇందిరాపార్క్ వద్ద సెంట్రింగ్ కార్మికుల ధర్నాలో పాల్గొని కవిత వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాళ్లు కట్టుకొని ప్రాణాలు ఫణంగా పెట్టి గాలిలో వేలాడుతూ పనిచేయాల్సి వస్తుందని చెప్పారు. సెంట్రింగ్ కార్మికులు లేకుంటే అద్దాల మేడాలు ఉండవని,
కానీ బిల్డింగ్ లు నిర్మించే అగ్రిమెంట్ లో మాత్రం కార్మికుల పేరు పెట్టటం లేదన్నారు. 2 లక్షల రూపాయల పనికోసం వెళ్తున్నప్పటికీ 15 లక్షల రూపాయల విలువైన నిర్మాణ సామగ్రి తీసుకెళ్తున్నారని తెలిపారు. కానీ మీ మెటీరియల్ కు కనీసం రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గుంపు మేస్త్రీ సీఎంగా వచ్చాక తెలంగాణలో అందరి పరిస్థితి ఆగమవుతున్నదని కవిత తెలిపారు. అందుకే గుంపు మేస్త్రీ హఠావో…తెలంగాణ బచావో అంటూ పిలుపునిచ్చారు.
హైడ్రా వచ్చిన తర్వాత నోటీసులు లేకుండా ఇళ్లు కూలగొడుతున్నారని, దీంతో సెంట్రింగ్ పనిచేస్తున్న వారు ఆ ఇళ్లు కూల్చే సమయంలో మెటీరియల్ నష్టపోతున్నారని చెప్పారు. దీనికి ఇంటి యాజమాని గానీ ప్రభుత్వం గానీ పరిహారం ఇవ్వటం లేదని తెలిపారు. 86 చోట్ల సెంట్రింగ్ కార్మికులు, కాంట్రాక్టర్లు పదిరోజులుగా పని బంద్ చేశారని కవిత చెప్పారు. అయినప్పటికీ తమ దగ్గర ఉన్న కూలీలను పోషించడం వారి గొప్పదనమన్నారు. సెంట్రింగ్ కార్మికులు చూపిస్తున్న మానవత్వాన్ని ఈ ప్రభుత్వం కూడా చూపించాలని కోరారు. వారు చూపించే మానవత్వానికి చేతులెత్తి మొక్కాలన్నారు. శనావారం సాయంత్రం లోగా సెంట్రింగ్ కార్మికులను ప్రభుత్వం చర్చలకు పిలవాలని కవిత డిమాండ్ చేశారు. వాళ్లు అడుగుతున్న వాటిలో గొంతెమ్మ కోరికలు ఏమీ లేవన్నారు. 12 అంశాలతో చాలా చిన్న విషయాలే అడుగుతున్నారని చెప్పారు. వారికి ఈఎస్ఐ కార్డులు, స్క్వేర్ మీటర్ కు 51 రూపాయలు, కార్మికులు చనిపోతే ఇచ్చే డబ్బులు పది నుంచి 20 లక్షలు అడుగుతున్నారని వివరించారు. వాళ్లు అడిగే అన్ని డిమాండ్లు కూడా సహేతుకమైనవేనని, వాటికి టీఆర్ఎస్ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పుడు మేస్త్రీలు స్వ్కేర్ ఫూట్ కు రూ. 400 అడుగుతున్నారని చెబుతున్నారన్నారు. దానిలో సెంట్రింగ్ కార్మికుల వాటా ఎంతో కూడా చెప్పాలన్నారు. మేస్త్రీల చేతిలో ఎట్టి పరిస్థితుల్లో సెంట్రింగ్ కార్మికుల జుట్టు ఉండకూడదని హెచ్చరించారు.
మేమొచ్చాక సమస్యలన్నీ పరిష్కరిస్తాం
తెలంగాణ రక్షణసేన అధికారంలో వచ్చిన తర్వాత సెంట్రింగ్ కార్మికుల అన్ని డిమాండ్లను తీరుస్తామని కవిత హామీ ఇచ్చారు. 186 చోట్ల వెయ్యి నుంచి 2 వేల గజాల స్థలం ఇస్తామని ప్రకటించారు. ప్రతి మండలంలో సెంట్రింగ్ కార్మికుల సంఘాలు ఏర్పాటు కావాల్సి ఉందన్నారు.
హైదరాబాద్ నిర్మాణంలో మీ పాత్ర కీలకమని, మీ అడుగులో అడుగునవుతానంటూ కవిత భరోసా ఇచ్చారు. రెండు రోజుల్లో సెంట్రింగ్ కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపకపోతే తాను కూడా వారితో పాటు వచ్చి ధర్నాలో కూర్చుంటానని కవిత ప్రకటించారు. ఎన్ని రోజులైనా సరే వారి సమస్య తీరే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతానన్నారు. సెంట్రింగ్ కార్మికులను ప్రభుత్వం పట్టించుకోకపోతే వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వారే కర్రు కాల్చివాత పెడతారని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.








