రైతుల పొట్టగొడుతున్న తెలంగాణ ప్రభుత్వం
-కల్వకుంట్ల కవిత
వికారాబాద్ లో రైతులతో కలిసి ఆందోళనకు దిగిన కవిత, విశారదన్
(వికారాబాద్)
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కష్టాల పాలవుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పెనం మీద ఉన్న రైతులు ఇప్పుడు పొయ్యిలో పడ్డట్టు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం రైతుల భూములను నిర్బంధంగా తీసుకోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి, ధర్మ సమాజ్ పార్టీలు బుధవారం ఆందోళనకు దిగారు. రైతుల కోసం వికారాబాద్ ఆర్డీవో ఆఫీస్ ఎదురుగా కల్వకుంట్ల కవిత, విశారదన్ మహరాజ్, రైతులు నడి ఎండలో బైఠాయించి ఆందోళన చేశారు. ఆందోళన చేస్తున్న కవిత, విశారదన్ పై పోలీసుల ఓవరాక్షన్ ప్రదర్శించారు. పోలీసులతో కవిత, విశారదన్ వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ పరిశ్రమల పేరుతో చిన్న, సన్నకారుల రైతుల భూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ను కాల్చిన బూడిద చేసినా సరే ఈ పాపం పోదన్నారు. బలవంతపు భూసేకరణ నిలిపివేసే వరకు ఉద్యమిస్తామని కవిత స్పష్టం చేశారు. ఎక్కడ రైతులకు అన్యాయం జరిగితే అక్కడ జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ సంయుక్తంగా పోరాడుతాయన్నారు.
బలవంతపు భూసేకరణ
పరిశ్రమల కోసం పరిగిలో రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని కవిత ఆరోపించారు.
కల్లాపూర్, రాపోల్, భట్ల చందారం సహా పలు గ్రామాల్లో రైతుల భూములను గుంజుకుంటున్నారని తెలిపారు. ఆయా గ్రామాల్లో మొత్తం భూమిని తీసుకుంటున్నారని, ఆ రైతులకు మరో దిక్కు లేని పరిస్థితి తెచ్చారని విమర్శించారు. ఇక్కడ రైతుల బాధ రాష్ట్రం మొత్తానికి తెలియాలనే వికారాబాద్ లో ఆందోళన చేపట్టామని వివరించారు. వికారాబాద్ లో రైతులు ఎండలో కూర్చొని ధర్నా చేస్తుంటే…నిజామాబాద్ లో పసుపు రైతులు మద్దతు ధర కోసం ఆందోళన చేస్తున్నారని కవిత తెలిపారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతులు సంతోషంగా లేరని వెల్లడించారు. కొంతమంది రైతులకు మద్దతు ధర లేదు, కొంతమందికి ఋణమాఫీ జరగలేదని, కొన్ని చోట్ల యూరియా లేదని చెప్పారు. ఇలా ఎక్కడ చూసినా సరే రైతులు తీవ్రంగా బాధపడుతున్న పరిస్థితిని ఈ కాంగ్రెస్ తీసుకొచ్చిందని కవిత దుయ్యబట్టారు. అది చాలదన్నట్లుగా చిన్న, సన్నకారు రైతుల భూములు లాక్కుంటూ వారిని గోస పెడుతోందని విమర్శించారు.
ఇక్కడి రైతులకు ఎన్నో ఏళ్ల క్రితమే ప్రభుత్వం భూములు ఇచ్చిందని, ఇప్పుడు ఆ భూములను లాక్కోవటం అంటే రైతుల నోటికాడ బుక్క లాక్కోవటమేనని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ను కాల్చి బూడిద చేస్తే తప్ప ఈ పాపం పోదన్నారు. ఇక్కడ రైతుల నుంచి దాదాపుగా 1200 ఎకరాలు తీసుకుంటున్నారని, అందులో వెయ్యి ఎకరాలు అసైన్డ్ భూములేనని కవిత వివరించారు. మిగతా 200 ఎకరాలు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులవేనని తెలిపారు.
మూసీని కాలుష్యం చేస్తున్న సీఎం
ఈ ముఖ్యమంత్రి ఒక పక్క మూసీ బాగు చేస్తా అని హైదరాబాద్ లో చెబుతుంటాడని, మరో పక్క మూసీ నెత్తి మీద ఫ్యాక్టరీలు పెట్టి కాలుష్యాన్ని మూసీలోకి తెస్తున్నాడని కవిత ఆరోపించారు. కనీసం ఇక్కడ ఏర్పాటు చేసే ఫ్యాక్టరీల్లో మనవాళ్లకు ఉద్యోగాలు ఇస్తారా అంటే అదీ లేదన్నారు. కాంగ్రెస్ మూడేళ్ల ప్రభుత్వంలో మొత్తం కూడా మోసచరిత్రేనని చెప్పారు. రైతులకు రైతు భరోసా లేదు, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇస్తామన్న ఆర్థిక సాయం కూడా ఇవ్వలేదన్నారు. ఇస్తామన్న మాట కల్లస్, చేస్తామన్న పనులు మటాషేనని ఎద్దెవా చేశారు.
మరో పది రోజుల్లో ఈ గడ్డ మీద మరో ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించబోతున్నదని కవిత వెల్లడించారు. పార్టీ ఏర్పాటు తర్వాత మరిన్ని ఉద్యమాలు చేస్తూ రైతుల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు. మన సమస్యలపై మనమే పిడికిలి ఎత్తి పోరాటం చేస్తేనే పరిష్కారం లభిస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా పిడికిలెత్తి పోరాటం చేయటం ద్వారానే సాధించుకున్నామని గుర్తు చేశారు.
కవితకు ఫోన్ చేసిన వికారాబాద్ కలెక్టర్
ఇండస్ట్రియల్ కారిడార్ కోసం రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేరని వికారాబాద్ కలెక్టర్ కు కవిత స్పష్టం చేశారు. పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ కారణంగా భూములు కోల్పోతున్న రైతుల బాధలను స్వయంగా వారి వద్దకు వెళ్లి వినాలని ఆమె కలెక్టర్ ను కోరారు. రైతుల ఆందోళనకు మద్దతుగా ధర్నాకు దిగిన కవితకు నచ్చచెప్పేందుకు స్వయంగా కలెక్టర్ ఫోన్ చేసి మాట్లాడారు.
రైతులకు స్పష్టమైన హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామని కవిత స్పష్టం చేశారు. రైతులతో ఆర్డీవోను మాట్లాడిస్తామని కలెక్టర్ చెప్పినా కవిత ఒప్పుకోలేదు. స్వయంగా మీరే వెళ్లి రైతులకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్ నుంచి స్పష్టమైన హామీ లేకపోవటంతో కవిత ఆందోళన కొనసాగించారు.








