సామాజిక తెలంగాణ కోసం ఎంతో కృషి చేసిన ముచ్చర్ల సత్గాయనారాయణ బాటలోనే మనం నడవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారులు, మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆయన ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముచ్చర్ల నడిచిన మార్గంలోనే జాగృతి నడుస్తున్నదన్నారు.
“ముచ్చర్ల సత్యనారాయణ లాంటి వారి గురించి కొత్తతరం నాయకులకు తెలియాల్సి ఉంది. ఈ విషయంలో తెలంగాణ జాతి మొత్తాన్ని జాగృతం చేసేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం. నేను బీఆర్ఎస్ లో ఉన్నప్పటి నుంచి ముచ్చర్ల జయంతి గురించి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాను. తెలంగాణ ఫస్ట్ అన్నదే మా నినాదం. తెలంగాణ మంచి కోసం పనిచేసిన వారు ఏ పార్టీలో ఉన్నా వారి స్ఫూర్తిని తీసుకుంటాం. వారి మంచి గురించి మేము కచ్చితంగా మాట్లాడుతాం. గత ప్రభుత్వంలో ముచ్చర్ల లాంటి ఎంతో మంది ఉద్యమకారులు విస్మరణకు గురవటం బాధాకరం. దేశపతి శ్రీనివాస్ తో కలిసి రవీంద్ర భారతిలో తెలంగాణ తేజో మూర్తుల జయంతులు, వర్థంతులు జరపటం కోసం నా వంతు ప్రయత్నం చేశాను. దురదృష్టం ఏమిటంటే ఇప్పటికి కూడా ట్యాంక్ బండ్ పై మన తెలంగాణ వారి విగ్రహాలు లేవు. ఆంధ్రా నాయకుల విగ్రహాలు తీసేయమనటం లేదు. అవసరమైన నాడు తప్పకుండా తీసేద్దాం. కానీ మన తెలంగాణ వారి విగ్రహాలు కచ్చితంగా ట్యాంక్ బండ్ పై ఉండాలి. జాగృతిలో యంగ్ స్టర్స్ ఉన్నారు. వారంతా కూడా ఉద్యమకారుల విగ్రహాలు చూసి స్ఫూర్తి పొందుతారు. ముచ్చర్ల సత్యనారాయణ విగ్రహం ట్యాంక్ బండ్ వద్ద పెట్టాలి. అమరజ్యోతికి అవినీతి మరకలు అంటాయని చెప్పి ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పటి వరకు దానిపై విచారణ జరపలేదు. అమరజ్యోతిని పట్టించుకోవటం లేదు. తెలంగాణ ఉద్యమకారుల జయంతి, వర్ధంతులు జరపటం లేదు. తెలంగాణ జాగృతి తప్పకుండా ఒక రోజు అధికారంలోకి వస్తుంది. అప్పుడు తెలంగాణ మలిదశ ఉద్యమం తొలి అమరుడు శ్రీకాంతాచారి జయంతి, వర్ధంతి అఫీషియల్ గా ప్రభుత్వపరంగా నిర్వహిస్తాం. తెలంగాణ వాదానికి సెంటర్ పాయింట్ గా అమరజ్యోతిని కేంద్రం చేస్తాం. తెలంగాణ విద్యార్థులందరికీ ఉద్యమకారుల త్యాగాలను తెలిసేలా చేస్తాం.

ముచ్చర్ల సత్యనారాయణ ముల్కి ఉద్యమం నుంచి తొలి, మలి దశ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. తెలంగాణలో ఉద్యమంలో ఎంతో మంది అన్ సంగ్ హీరోలు ఉన్నారు. వారి చరిత్ర కూడా భవిష్యత్ తరాలకు తెలిసేలా ప్రయత్నం చేస్తాం.”








