ఓర్వలేక రఘునందన్ అరుపులు

బుల్లెట్ ట్రైన్ అలైన్ మెంట్ మారినా సోయిలేని ఎంపీ

రఘునందన్ పై టీఆర్ఎస్ నేతల ధ్వజం

శంకర్ పల్లి ఎక్కడుందో తెలుసా అని ప్రశ్నించిన బాలయ్య, దయాకర్ రెడ్డి

(హైదరాబాద్) :

బీఆర్ఎస్ తో కుమ్మక్కు రాజకీయాల్లో భాగంగానే మెదక్ ఎంపీ రఘునందన్ రావు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవితపై విమర్శలు చేశారని మెదక్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఎం. బాలయ్య, టీఆర్ఎస్ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ చార్జి దయాకర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో మెదక్ జిల్లా నాయకులతో కలిసి వారు విలేకరులతో మాట్లాడారు. పటాన్ చెరు ఎమ్మెల్యేతో కలిసి ఎంపీ రఘునందన్ ఒకే కారులో వెళ్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసిన విషయం రాష్ట్రమంతా చూసిందన్నారు. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాదా అని ప్రశ్నించారు. 

జహీరాబాద్ ఏ నియోజకవర్గంలో ఉందో తెలియదా అని కవితను ప్రశ్నిస్తున్న రఘునందన్ తన పార్లమెంట్ పరిధిలోకి రాని శంకర్ పల్లి లో ఎక్స్ ప్రెస్ రైల్ హాల్టింగ్ కోసం ఎందుకు లెటర్ రాశారని.. కేంద్ర రైల్వే శాఖ హాల్టింగ్ ఇస్తే అది తన ఘనతగా ఎందుకు ప్రచారం చేసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లాలో ఉన్న జహీరాబాద్ ప్రజలకు ఏ అవసరం వచ్చినా జిల్లా కేంద్రానికే వస్తారని.. సంగారెడ్డికి ఎంపీగా రఘునందన్ రావు ఉన్నారనే విషయం ఆయన గుర్తుంచుకోవాలన్నారు. హైదరాబాద్–ముంబయి రైల్వే మార్గాన్ని సంగారెడ్డి, జహీరాబాద్ మీదుగా వేసి ఉంటే ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధికి దోహదం అయ్యే అవకాశాలున్నాయని గుర్తు చేశారు. అలా కాకుండా తాండూరు మీదుగా రైల్వే లైన్ పోతున్నా అన్ని అంశాలపై మాట్లాడే ఎంపీ ఎందుకు మాట్లాడలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జహీరాబాద్ కు బుల్లెట్ ట్రైన్ రప్పించడానికి రఘునందన్ రావు సహకరించపోతే తమ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల కవితతో కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి తామే వినతిపత్రం ఇచ్చి పోరాడుతామన్నారు.

టీఆర్ఎస్ పుట్టకముందే మున్సిపాలిటీ గెలిచింది

టీఆర్ఎస్ పార్టీ పుట్టకముందే ఉద్యమ సంస్థగా ఎన్నికల్లో పోటీ చేసి ఒక మున్సిపాలిటీతో పాటు 42 కౌన్సిలర్ స్థానాలను గెలుచుకుందని పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ చార్జీ దయాకర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఎక్కడుందని ప్రశ్నిస్తున్న రఘునందన్ కు మొన్న పెద్ద సంఖ్యలో తరలివచ్చిన సంగారెడ్డి ప్రజలే సమాధానం చెప్పారని అన్నారు. కవిత పర్యటనకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడాన్ని చూసి తట్టుకోలేకనే మెదక్ ఎంపీ అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. మెదక్ ఎంపీగా ఉండి ఆయన పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో గెలిచిందో చెప్పాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి నైతిక బాధ్యత వహించి ఎంపీ రఘునందన్ రాజీనామా చేస్తే కల్వకుంట్ల కవిత సాధారణ కార్యకర్తను ఆయనపై పోటీకి నిలబెట్టి గెలిపిస్తారని సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మలతో పెద్ద ఎత్తున మహిళలను భాగస్వాములను చేసిందే కవిత అని గుర్తు చేశారు. రఘునందన్ ఎంత మంది కార్యకర్తలను గెలిపించారో చెప్పాలన్నారు.  కవితపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతే బీజేపీలో పదవులు వస్తాయని రఘునందన్ భావిస్తున్నట్లున్నదని చెప్పాారు.

లాయర్ గా ఫీజు తీసుకుని దొంగల తరపున వకాలత్ తీసుకుని మాట్లాడినట్టే రాజకీయంగానూ రఘునందన్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకుల తరపున వకాలత్ తీసుకుని మాట్లాడుతున్నారని అన్నారు. రఘునందన్ రావు వందశాతం కాంప్రమైజింగ్ పాలిటిక్స్ చేస్తున్నారనే విషయం మెదక్ జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు. లాబీయింగ్ పాలిటిక్స్, బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్, డబ్బు సంచులకు అమ్ముడుపోయే రాజకీయాలకు ఇకనైనా ముగింపు పలికితే మంచిదనే విషయం మెదక్ ఎంపీ గుర్తించాలన్నారు. నోరు ఉందని పెద్ద గొంతుతో మాట్లాడితే మెదక్ ఎంపీ అవినీతిపై డెయిలీ సీరియల్ మాదిరిగా ప్రెస్ మీట్ లు పెట్టి బయట పెడుతామని హెచ్చరించారు.