కవితకు మద్దతు పలకడానికి తరలి వచ్చిన వివిధ సంఘాల ప్రతినిధులు

మద్దతుదారులతో కిక్కిరిసి పోయిన జాగృతి కార్యాలయం | హైదరాబాద్ 

సామాజిక తెలంగాణ సాధన కోసం కలిసి నడుద్దామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తెలంగాణ అస్తిత్వం కోసం పనిచేసే పార్టీ అవసరం ఉందని తెలంగాణ  ఉద్యమ కారుల జేఏసీ నాయకులు ప్రజా సంఘాలు, ఉద్యోగ, కుల సంఘాలు, వివిధ యూనివర్సిటీల విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. మంగళవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత ను కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కవితకు సంఘీభావం తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జాగృతి కార్యకర్తలు, అభిమానులు, వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి, కుల సంఘాలు, కార్మిక సంఘాల నాయకులు, సింగరేణి కార్మికులు, ఉద్యమకారులు తరలి వచ్చారు. దీంతో  హైదరాబాద్ లోని జాగృతి కార్యాలయం కిక్కిరిసిపోయింది. జాగృతి కార్యకర్తలు, అభిమానులు జై కవితక్క అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా వారందరికీ అభివాదం చేసి ధన్యవాదాలు తెలిపారు కవిత.

తెలంగాణ కోసం మీ ఆధ్వర్యంలో రాబోయే పార్టీకి మా మద్దతు ఉంటుందని వారంతా కవితకు భరోసా ఇచ్చారు. సింగరేణి కార్మికులు, హెచ్ఎంఎస్,  ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, బీసీ సంఘం, అన్ని యూనివర్సిటీల విద్యార్థి సంఘాలు, తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ, తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల జేఏసీ, ఉద్యమకారుల జేఏసీ స్టేట్ కమిటీ, తెలంగాణ పొలిటికల్ జేఏసీ, ఆటో యూనియన్ నాయకులు, మహిళా సంఘాలు, కుల సంఘాల నాయకుల బాధ్యులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు కవితను కలిసిన వారిలో ఉన్నారు. 

Supporters gather for Kavitha social Telangana call in Hyderabad

మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతే పార్టీ ద్వారా తెలంగాణలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్న నమ్మకం ఉందని వారంతా కవితతో అన్నారు. మీ బాటలో మీతో పాటు కలిసి నడుస్తామని ధైర్యమిచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి మద్దతు తెలపడం పట్ల కవిత చాలా సంతోషం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో ఇంత దూరం వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే నిరంతరం తన పోరాటం ఉంటుందని చెప్పారు. ప్రజాస్వామ్య పద్దతిలో నడిచే తమకు అందరూ మద్దతివ్వాలని కోరారు.