పాలుమూరుపై బీఆర్ఎస్ పాదయాత్ర డ్రామాలు
పదేళ్లలో పాలమూరు ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు
లక్ష్మిదేవిపల్లిలో కవిత సభతో బీఆర్ఎస్ లో ఉలికి పాటు
బీఆర్ఎస్ పై మహబూబ్ నగర్ టీఆర్ఎస్ నేతల ఆగ్రహం
(హైదరాబాద్):
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేయాలంటూ వచ్చే నెలలో బీఆర్ఎస్ పాదయాత్ర చేస్తామని చెప్పటం చూస్తుంటే నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా ఉందని తెలంగాణ రక్షణ సేన నాయకులు మండిపడ్డారు. అసలు పదేళ్లు అధికారంలో ఉండి ఉమ్మడి పాలమూరు జిల్లాకు ద్రోహం చేసిందే బీఆర్ఎస్ అని అన్నారు. పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి చేసే విషయంలో బీఆర్ఎస్ పాదయాత్ర చేస్తామని ప్రకటించటంపై మహబూబ్ నగర్ టీఆర్ఎస్ నాయకులు బంజారాహిల్స్ లో తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పాలమూరు వలసలకు, ఆ ప్రాంతం వెనుకబడటానికి కేసీఆర్, బీఆర్ఎస్ దే బాధ్యత అన్నారు. అంతటి అన్యాయం చేసిన బీఆర్ఎస్ ను ఈ ప్రాంత వాసులు ఎన్నటికీ క్షమించరని చెప్పారు.
కవిత సభతో ఉలికిపాటు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు అందరికన్నా ఎక్కువ ద్రోహం చేసిందే బీఆర్ఎస్ అని టీఆర్ఎస్ నాయకులు గొంగళ్ల రంజిత్ విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తారన్న నమ్మకంతో జిల్లా వాసులు 12 ఎమ్మెల్యే స్థానాలను గెలిపించారని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ మాత్రం మహబూబ్ నగర్ వాసుల గొంతు కోసిందన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి…ఇక్కడి ప్రజలకు ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 35 వేల ప్రాజెక్టును రూ.85 వేల కోట్లకు పెంచి కాంట్రాక్టర్ల కడుపులు నింపి…ఈ ప్రాంత వాసుల కడుపుకొట్టారన్నారు. తెలంగాణ వస్తే తమ జీవితాలు బాగుపడతాయని భావించినప్పటికీ ఇప్పటికీ వలసలు ఆగలేవన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. 12 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో రిజర్వాయర్ ను పంచుకున్నారే తప్ప ప్రజలకు మంచి చేయలేదన్నారు. నీళ్ల మంత్రిగా ఉన్న హరీశ్ రావు కాంట్రాక్టర్ తో కుమ్మక్కై వేల కోట్లు దోచుకున్నాడన్నారు. అదే విధంగా భూ నిర్వాసితులైన రైతుల పైసలను ఫైనాన్స్ కంపెనీ పేరుతో బీఆర్ఎస్ నేతలు నిరంజన్ రెడ్డి, జనార్థన్ రెడ్డి దోచుకున్నారని చెప్పారు. అసలే భూములు కోల్పోయిన రైతుల పైసలను కూడా ఫైనాన్స్ కంపెనీ పేరుతో దోచుకున్నారని విమర్శించారు. ఈ నెల 8 న లక్ష్మిదేవిపల్లి వద్ద కవిత పెట్టిన సభతో బీఆర్ఎస్ లో ఉలికిపాటు వచ్చిందన్నారు. ప్రజల్లో ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనని పాదయాత్ర అంటూ డ్రామాలు మొదలు పెట్టారని విమర్శించారు. బీఆర్ఎస్ తీరు చూస్తుంటే నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు ఉందన్నారు.
పాలమూరు ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరు
పాలమూరు కు బీఆర్ఎస్ చేసిన ద్రోహానికి ఆ పార్టీని ప్రజలు ఎన్నటికీ క్షమించారని టీఆర్ఎస్ నేత గవినోళ్ల శ్రీనివాస్ చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉండి ఈ ప్రాంతానికి అన్యాయం చేశారని చెప్పారు. ఈ అన్యాయానికి కేసీఆర్, బీఆర్ఎస్ దే బాధ్యత అన్నారు. చేసిన తప్పుకు పశ్చాత్తాపం లేకుండా ఏ మొఖం పెట్టుకొని పాదయాత్ర చేస్తారని ప్రశ్నించారు. ముందు మీరు చేసిన తప్పులకు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.
పదేళ్లు ఏం చేశారు?
బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉంటే ఇప్పుడు పాదయాత్ర చేసే పరిస్థితి ఎందుకు వచ్చేదని వెంకటరమణ మూర్తి ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్ట్ పేరు చెప్పుకొని వేల కోట్లు దోచుకున్నారే తప్ప ప్రజలకు మంచి చేయలేనదని ఆవేదన వ్యక్తం చేశారు. జూరాల నీటి సోర్స్ ను మార్చేసి కాంట్రాక్టర్ కు వందల కోట్లు కట్టబెట్టారని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ కూడా మహబూబ్ నగర్ ప్రజలకు అన్యాయం చేస్తుందన్నారు. భవిష్యత్ లో కచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని…అప్పుడు ఈ ప్రాజెక్ట్ ను కవిత పూర్తి చేస్తారని చెప్పారు.
మళ్లీ మోసం చేస్తారా?
పదేళ్లు అధికారం ఇస్తే మహబూబ్ నగర్ వాసులకు చేసిన అన్యాయం సరిపోలేదని మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారా అంటూ బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పేరుతో ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు పంచాయితీ పెట్టారని టీఆర్ఎస్ నాయకులు మెట్రకాడి ప్రభాకర్ మండిపడ్డారు. అటు ఉమ్మడి మహబూబ్ నగర్ బిడ్డ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రజలను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేన్నరేళ్లు గడుస్తున్నా తట్టెడు మట్టి కూడా తీయలేదని అన్నారు. బీఆర్ఎస్ చేసిన ద్రోహాం ప్రజలకు అర్థమైందని ఇక మీరు ఎన్ని డ్రామాలు చేసిన మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదని అన్నారు. మీడియా సమావేశంలో టీఆర్ఎస్ నేతలు కృష్ణా, లక్ష్మీ శ్రావణి, సౌజన్య రెడ్డి, ఎల్లన్, మాలతి, రవి రాథోడ్, శ్యామ్, సురేందర్ పాల్గొన్నారు.








