ఉద్యమాల గడ్డ నుంచి బేల మాటలేల..

సీఎం రేవంత్ పై టీఆర్ఎస్ అసహనం

మహారాష్ట్ర సీఎంతో భేటీకి చేసిన ప్రయత్నాలపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలి

ఏపీ జలదోపిడీకి రేవంత్ వంత పాడుతున్నరు

టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కామెర నవీన్ కుమార్

(తెలంగాణ రక్షణ సేన కార్యాలయం, హైదరాబాద్):

తెలంగాణ ఉద్యమాల ఖిల్లా అన్న విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కామెర నవీన్ కుమార్ అన్నారు. బుధవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో పార్టీ నాయకులు ఎదురుగట్ల సంపత్ గౌడ్, దండెం ఆనందం, ఎత్తరి మారయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తాము తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మించేందుకు ప్రయత్నిస్తుంటే మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని సీఎం రేవంత్ బేల మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోరాటాల పురిటిగడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడటం రాష్ట్ర ప్రజలను అవమానించడమేనన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలేమిటో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే తుమ్మిడిహెట్టి నిర్మిస్తామని ఇచ్చిన హామీని రెండున్నరేళ్లు పట్టించుకోలేదన్నారు. ఇంజినీర్లు, సెక్రటరీల స్థాయిలో ఈ బ్యారేజీ నిర్మాణం గురించి చర్చలు కూడా జరగలేదన్నారు. రాజకీయం కోసమే తుమ్మిడిహెట్టి బ్యారేజీ జపం చేస్తున్నారని తెలిపారు.

కేసీఆర్ ప్రాణహిత–చేవెళ్లను రీ డిజైన్ చేసి మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు నష్టం చేశారని, తుమ్మిడిహెట్టి నిర్మిస్తామని హామీ ఇచ్చి దానిని నిలబెట్టుకోకుండా రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ జలదోపిడీకి రేవంత్ రెడ్డి కొమ్ము కాస్తున్నారని తెలిపారు. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు చేపడితే ఏపీకి గోదావరి జలాల్లో అదనంగా 200 టీఎంసీల హక్కు దక్కుతుందనే విషయం ముఖ్యమంత్రికి తెలియకపోవడం విచారకరమన్నారు. ఏపీకి వంత పాడే సలహాదారులను పెట్టుకొని సీఎం తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మైలారం వరకు 71 కి.మీ.ల కాల్వ తవ్వినా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మించలేదని, మైలారం తర్వాత జైపూర్ సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్ ను బైపాస్ చేసే అవకాశం ఉన్నా ఆ ప్రయత్నం కూడా చేయకుండా అనాథలా అప్పటి ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును వదిలేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చి రాజకీయ ప్రకటనలతో కాలయాపన చేస్తున్నదని మండిపడ్డారు. మహారాష్ట్ర సీఎంతో అపాయింట్ మెంట్ పై ఇకనైనా సీఎం రేవంత్ రెడ్డి బేల మాటలు బంద్ చేయాలని సూచించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీని 150 మీటర్ల ఎత్తులో నిర్మించడానికి అవసరమైన చర్చల ప్రక్రియ ప్రారంభించే ప్రయత్నాలు చేయాలని నవీన్ కుమార్ సూచించారు.