నిజాయితీ లేకనే తుమ్మిడిహెట్టిపై కొర్రీలు

148 మీటర్లకు ఉన్న ఒప్పందం ప్రకారం పనులు చేయండి

ఐదుగురు ముఖ్యమంత్రులు మారినా ఇక్కడి ప్రజల తలరాత మారలేదు

తుమ్మిడిహెట్టి ప్రాంతాన్ని సందర్శించిన కవిత

-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

(తెలంగాణ రక్షణసేన, తుమ్మిడి హెట్టి)

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగా రైతుల మీద ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే ముందు 150 మీటర్లకైనా సరే తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం చెయ్యాలని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మహారాష్ట్ర వాళ్లు అడ్డుపడితే అప్పుడు మనం పర్మిషన్ గురించి ఆలోచిద్దామని చెప్పారు. గోదావరి నదిపై తుమ్మిడిహెట్టి వద్ద తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాంతాన్ని కవిత మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అవసరమైతే 148 మీటర్ల వరకే నీళ్లను నింపుకుందామని సూచించారు. నిజంగా తుమ్మిడి హెట్టి కట్టాలనుకుంటే ఇప్పుడే పనులు ప్రారంభించవచ్చని,  

ఈ ముఖ్యమంత్రి ఇప్పటికే 30 నెలలు టైమ్ వేస్ట్ చేశాడని విమర్శించారు. ఇంకో ఏడాది మాత్రమే ఆయనకు సమయం ఉందని తెలిపారు. ఆ తర్వాత ఆయన మళ్లీ గెలుస్తాడో లేదో కూడా తెలియదని చెప్పారు. అందుకే వెంటనే ఈ ప్రాజెక్ట్ సైట్ కు ముఖ్యమంత్రి రావాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే భూ సేకరణ కొంత వరకు జరిగిందని,  వెంటనే పనులను ప్రారంభించాలని కోరారు.  మిగిలిన భూమి కోసం ఇప్పుడున్న రేటు ప్రకారం రైతులకు డబ్బు ఇచ్చి భూ సేకరణ చేయాలన్నారు. తెలంగాణ రాకముందే 2010లో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలు నీళ్లు ఇవ్వాలని అనుకున్నామని కవిత వెల్లడించారు. ఇక్కడ నీళ్లు ఒట్టిగా పోతున్నాయని బాధపడ్డామని, అప్పుడే తుమ్మిడి హెట్టి అనే ఆలోచన చేశామని గుర్తు చేశారు. ఉద్యమంలో కడుపు కట్టుకుని త్యాగం చేసి కొట్లాడితే తెలంగాణ వచ్చిందని చెప్పారు.   ఐదుగురు ముఖ్యమంత్రులు మారినా తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు కట్టలేకపోయారని కవిత విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్, రేవంత్ రెడ్డి అందరూ తుమ్మిడి హెట్టి కడతామన్నారని చెప్పారు. 2006 నుంచి చెబుతూనే 2026 వరకు కూడా కట్టలేదని తెలిపారు. నిజానికి 148 మీటర్ల వరకు ప్రాజెక్ట్ కట్టుకునే ఒప్పందం రెడీగా ఉందని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డికి తుమ్మిడి హెట్టి కట్టాలని లేదన్నారు. అందుకే ఏదో కొర్రీలు పెడుతున్నాడని మండిపడ్డారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తటం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ చేస్తే వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ ఎత్తడా..? పైగా కిషన్ రెడ్డి మధ్యలో అడ్డుకుంటున్నాడని ఈ రేవంత్ రెడ్డి చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. 

Kalvakuntla Kavitha visits Tummidihetti project site and calls for immediate construction under the 148-metre agreement.

కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టు ఒప్పందాలు

 తెలంగాణ వచ్చాక 12 ఏళ్లైనా పెన్ గంగా, వెన్ గంగా, ప్రాణహిత నీళ్లు మనకు వస్తలేవని కవిత అన్నారు. 2006 లో రాజశేఖర్ రెడ్డి ప్రాణిహిత, చేవెళ్ల పథకం చేపడుతామని చెప్పారన్నారు. ఒప్పందం లేకుండానే 71 కిలోమీటర్లు కాలువలు తవ్వి కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చుకుంటూ పోయారని విమర్శించారు. కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చేందుకు ఒప్పందం కాకుండానే అలా చేశారని దుయ్యబట్టారు. వాళ్లంటే ఆంధ్రావాళ్లు కావాలనే అలా చేశారని అనకుందాం.. కానీ కేసీఆర్ వచ్చాక కూడా నీళ్లు రాలేదని కవిత తెలిపారు. ముందు తుమ్మిడి హెట్టి ద్వారా అసిఫాబాద్, కాగజ్ నగర్ లో 2 లక్షల ఎకరాలు నీళ్లు ఇద్దామనుకున్నారని వివరించారు. రకరకాల కారణాలతో ప్రాజెక్ట్ డిజైన్ మారిందని, మేడిగడ్డ పూర్తైంది కానీ తుమ్మిడి హెట్టి మాత్రం కాలేదని చెప్పారు. ఇక్కడ గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో కూడా తెలియదని ఎద్దెవా చేశారు. ఇతర ప్రాంతాల్లో పచ్చని పంటలు పండుతుంటే ఇక్కడ ఎందుకు పంటలు పండటం లేదని ఆవేదనగా ఉందన్నారు. ఈ ప్రాంతం కోసం కొట్లాడే పార్టీ ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తమ పార్టీలోంచి తెలంగాణను తీసేసి ఇతర రాష్ట్రాలకు పోయిందని తెలిపారు. ఇక జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణ సోయి ఉండదని చెప్పారు. ఈ ప్రాంతం గురించి మాట్లాడే పార్టీ ఉన్నప్పుడు మాత్రమే మనకు న్యాయం జరుగుతుందని,  అందుకే తెలంగాణ రక్షణసేన పేరుతో ఈ ప్రాంత ప్రయోజనాలను కాపాడేందుకు పార్టీ పెట్టామని కవిత వెల్లడించారు.

Telangana Rakshana Sena Chief Kalvakuntla Kavitha inspects the proposed Tummidihetti project site and urges immediate commencement of construction works.