జర్నలిస్ట్ కేవీ రెడ్డి అరెస్ట్ అక్రమం

తెలంగాణ పోలీసుల తీరు సిగ్గుచేటు

-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

(తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్)

తెలంగాణ జర్నలిస్టు కే. వెంకటరాంరెడ్డి అరెస్టు అక్రమమని, వెంటనే అతన్ని విడుదల చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.  

ఏపీ పోలీసులు కేవీ రెడ్డిని లాక్కొని వెళ్తుంటే హృదయ విదారకంగా ఏడుస్తున్న ఆయన భార్య, చిన్న పిల్లలను  తెలంగాణ పోలీసులు అడ్డుకొని సహకరించడం సిగ్గుచేటన్నారు.

ఒకే కేసులో ఇది వరకే కేవీ రెడ్డిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు ఇప్పుడు మళ్లీ అదే కేసులో అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని విమర్శించారు. తెలంగాణ జర్నలిస్టుల అరెస్టుకు సహకరిస్తున్న ఇక్కడి పోలీసులు మన గడ్డ మీది నుంచి తెలంగాణావాదాన్ని వేర్పాటు వాదం అంటూ వ్యాఖ్యలు చేసిన సినిమా నటుల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీకి తొత్తుగా ఉండొచ్చు.. తెలంగాణ జర్నలిస్టులు, ప్రజలకు ఆ అవసరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ మేధావులు, జర్నలిస్టులపై దాడులను ఏమాత్రం సహించబోమని కవిత తేల్చి చెప్పారు. వెంటనే కేవీ రెడ్డిని విడుదల చేయాలని, కేవీ రెడ్డి కుటుంబానికి తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.