చిన్నారుల ఉసురు తీస్తున్న సర్కార్

ప్రభుత్వం బాధ్యత రాహిత్యంతో ఏటా 4 వేల మంది మృతి

పరిపాలన చేతకాకపోతే పక్కకు తప్పుకోవాలి

విద్య, వైద్యం విషయంలో ప్రభుత్వంపై ఇక యుద్ధమే

ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం

-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత 

(తెలంగాణ రక్షణ సేన, బంజారాహిల్స్, హైదరాబాద్)

తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఏటా వందల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. వైద్యం, విద్య విషయంలో ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. తెలంగాణ రక్షణసేన ప్రధాన కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆదిలాబాద్ లోని రిమ్స్ లో జరిగిన ఘటనపై బాధపడని వారుండరని కవిత గుర్తు చేశారు.

కేవలం ఈ ప్రభుత్వం బాధ్యతరాహిత్యం కారణంగానే పిల్లలు మాడిమసయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 

నిధులే విదిల్చరు

ఆదిలాబాద్ ఘటన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటళ్లలో ఉన్న పరిస్థితిపై సేకరించిన సమాచారం చూసిన తర్వాత రెండు రోజుల పాటు నిద్రపట్టలేదని కవిత చెప్పారు. అత్యంత భయంకరమైన చేదు వాస్తవాలు అందులో నివేదికలో ఉన్నాయన్నారు. 2020-21 లో 6000, 2022-23 లో 4,933, 2024-25 లో 3,853 మంది పసిపిల్లలు చనిపోయారని వెల్లడించారు. ఏ జిల్లాలో చూసినా దాదాపు 200 మంది పిల్లలు చనిపోయినట్లు రికార్డులు తెలుపుతున్నాయన్నారు. ప్రభుత్వం న్యూయార్క్, డల్లాస్ చేస్తామన్న హైదరాబాద్ లో గతేడాది 1046 మంది పిల్లలు చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యానికి 10 శాతం బడ్జెట్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం 5 శాతం మాత్రమే ఇస్తున్నదని విమర్శించారు. గతేడాది రూ.13,192 కోట్లు కేటాయిస్తే రూ. 9, 242 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని కవిత తెలిపారు.

ప్రభుత్వం రూ. 22 ఖర్చు చేస్తే అందులో రూపాయి మాత్రమే వైద్యానికి ఇస్తున్నారని విమర్శించారు. కేటాయించిన బడ్జెట్ లోనే రూ.3 వేల కోట్లు వాడలేదన్నారు. కానీ ఆ తర్వాత మళ్లీ రూ. 1900 కోట్లు కేటాయించారని తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కాగ్ కడిగిపారేసిందని కవిత వివరించారు. ఉన్న వాటిని ఖర్చు చేయకుండా మళ్లీ కేటాయింపులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో 11 వివిధ ఆరోగ్య పథకాలుంటే వాటిలో 7 హెల్త్ స్కీమ్ లకు బడ్జెట్ లో నిధులే కేటాయించలేదని కవిత చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి రూ.500 కోట్లు బకాయిలు ఉన్నాయని తెలిపారు. నిమ్స్ లో ముఖ్యమంత్రి చెబితే గానీ బెడ్ దొరికే పరిస్థితి లేదని కవిత చెప్పారు. సర్జరీ కావాలంటే దాదాపు 7 నెలలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉందన్నారు. నీలోఫర్ హాస్పిటల్ లో 200 శాతం బెడ్ ఆక్యుపెన్సీ ఉంటున్నదని.. డాక్టర్లు, వైద్య సిబ్బంది శక్తికి మించి పనిచేస్తున్నారని చెప్పారు. ఆరోగ్యశ్రీకి రూ. 700 కోట్లు కేటాయిస్తే రూ.140 కోట్లు మాత్రమే ఖర్చుచేశారని కవిత తెలిపారు.

Telangana Rakshana Sena chief Kavitha criticised the government over RIMS Adilabad infant deaths and announced plans to contest the Khairatabad bypoll

మనమే సరి చేద్దాం

కలెక్టర్లు ప్రభుత్వ హాస్పిటళ్లు, హాస్టళ్లను ఎందుకు విజిట్ చేయటం లేదని కవిత ప్రశ్నించారు.

చిన్న జిల్లాలే కదా.. కలెక్టర్లు తరచూ సందర్శిస్తే పరిస్థితి మారుతుందని సూచించారు. ఈ ప్రభుత్వానికి పరిపాలన చేతకాకపోతే పక్కకు తప్పుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

ఇంత మంది పిల్లలు చనిపోతే కూడా ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేకుండా పోయిందన్నారు. రిమ్స్ ఘటన జరగటంతో హెల్త్ మినిస్టర్ ఆదిలాబాద్ వెళ్లారు.. కానీ గత మూడేళ్లలో ఎప్పుడూ ఆయన ఆదిలాబాద్ జిల్లాకే వెళ్లలేదని విమర్శించారు. పైగా వచ్చిన రోజు హెలికాప్టర్ లో ఇంధనం అయిపోందని గొడవపడ్డాడే తప్ప..ప్రజల కోసం కలెక్టర్ తో మాట్లాడలేదని విమర్శించారు. రిమ్స్ హాస్పిటల్ లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. ప్రతిపక్షాలు, మంత్రులు వెళ్తున్నా ఈ సమయంలో కూడా హాస్పిటల్ లో పరిస్థితులు అలాగే ఉన్నాయని తెలిపారు. ఈ రాష్ట్రంలో విద్య, వైద్య రంగాన్ని సరిచేసుకోవాల్సిన సమయం వచ్చిందని, ఈ విషయంలో ప్రజలంతా కూడా బాధ్యత తీసుకోవాలని కోరారు. ఇక నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటళ్లను సందర్శిస్తామని కవిత ప్రకటించారు. మీ ప్రాంతంలో ఉన్న ప్రతి హాస్పిటల్ కు వెళ్లి అక్కడ పరిస్థితులను ఫోటోలు తీసి ప్రశ్నించాలని యువతను కోరారు. ఈ ప్రభుత్వం తోలు తీసైనా సరే పరిస్థితులను మనమే బాగుచేసుకుందామని పిలుపునిచ్చారు. 

స్కూళ్లలో వాష్ రూములేవి

తెలంగాణ ప్రభుత్వం బాధ్యత లేని కారణంగా ఆడపిల్లల ఆరోగ్యం కూడా క్షీణిస్తున్నదని కవిత ఆరోపించారు. శానిటరీ ప్యాడ్స్ పడేసేందుకు కూడా జాగ లేదన్నారు. రాష్ట్రంలో చాలా స్కూళ్లలో వాష్ రూములు కూడా లేవని చెప్పారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వెళ్లి స్కూళ్లను పరిశీలించాలని సూచించారు. వాష్ రూములు లేని స్కూళ్లు ఉంటే టీఆర్ఎస్ తరఫున చందా వేసుకొని కట్టిద్దామని పిలుపునిచ్చారు. ఐటీడీఏలో రూ.300 కోట్లు ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం వాడుకోవటం లేదని చెప్పారు. విద్య, వైద్యం మీద ఫోకస్ చేస్తూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మీద యుద్ధం చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలం తీసుకున్న ప్రైవేట్ హాస్పిటళ్లు 25 శాతం వైద్యం ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు.

గజం కబ్జా చేసినా తీసుకోండి

తన ఫామ్ హౌస్ లో గజం భూమి కూడా కబ్జా ల్యాండ్ లేదని.. ఎఫ్టీఎల్ లో కూడా లేదని కవిత చెప్పారు. చట్టానికి లోబడే ప్రతి పైసా సంపాదించుకున్నానన్నారు. భవిష్యత్ లోనూ అలాగే ఉంటానని స్పష్టం చేశారు. అఫిడవిట్ లో ఉన్న దానికన్నా రూపాయి ఎక్కువ చూపించినా వారికే ఆ ఆస్తి ఇచ్చేస్తానని చెప్పారు. రేవంత్ రెడ్డిది చేతగానీ, ఫెయిల్యూర్ సర్కార్ అని కవిత దుయ్యబట్టారు. ఈ ముఖ్యమంత్రికి పరిపాలన చేతకాక డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్, ఇంకో కేసు అంటూ సిట్ వేశారు గానీ ఆ తర్వాత ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ ఫామ్ హౌస్ లపై వేసిన సిట్ ద్వారా కూడా ఏం చర్యలు ఉండవని తేల్చి చెప్పారు. అంతర్గతంగా బీఆర్ఎస్, రేవంత్ మధ్య ఒప్పందాలు ఉంటాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి సిరిసిల్లకు వెళ్లి నెరేళ్ల బాధితులకు ఏం న్యాయం చేస్తారో చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు వారిపై దాడి చేసి పోలీసులను శిక్షించలేదన్నారు. ఎస్సీ కమిషన్ నివేదిక కూడా రాలేదన్నారు. వీటిపై చెప్పకుండా ముఖ్యమంత్రి సిరిసిల్లలో సభ పెడితే అది పాలిటిక్స్ తప్ప ప్రజలకు ఉపయోగపడదని స్పష్టం చేశారు. సాగునీరు, తాగునీరు విషయంలో చాలా ఇష్యూస్ ఉన్నాయని.. త్వరలోనే వాటిపై కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.

ఉపఎన్నికకు సిద్ధం

ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున కచ్చితంగా అభ్యర్థిని నిలుపుతామని వెల్లడించారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ తరఫున పోటీ చేసేందుకు అనుమతించిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. లేదంటే రాజ్యాంగం, చట్టం అవసరం లేదని మనమే చెప్పినట్లు అవుతుందని హెచ్చరించారు. ఎస్ఐఆర్ విషయంలో ప్రజల్లో అయోమయం నెలకొన్నదని కవిత చెప్పారు. రీ ఎడిట్ ఆప్షన్ లేదని, చిన్న చిన్న క్లరికల్ మిస్టేక్స్ తో చాలా ఓట్లు తీసేస్తున్నారని తెలిపారు. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కును హరించడమేనని స్పష్టం చేశారు.