బసవేశ్వరుడి స్ఫూర్తితో జాగృతి ప్రయాణం

 -కల్వకుంట్ల కవిత

బసవేశ్వరుడి 839వ జయంతికి నివాళులర్పించిన తెలంగాణ జాగృతి అధినేత్రి

(ట్యాంక్ బండ్, హైదరాబాద్)

బసవేశ్వరుడి 839వ జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ట్యాంక్ బండ్ పై సోమవారం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..839 ఏళ్ల క్రితం బసవేశ్వరుడి రూపంలో కొత్త సామాజిక విప్లవం పుట్టిందన్నారు. ఆ రోజు బసవేశ్వరుడు పాటించిన ప్రజాస్వామిక విలువలు, తీసుకువచ్చిన మార్పులను మనం ఈ రోజుకూ స్మరించుకుంటున్నామని తెలిపారు. కుల, వర్ణ, లింగ బేధాలు లేకుండా సమానత్వం ఉండాలని బసవేశ్వరుడు చెప్పారని, ఆయన చెప్పిన సమానత్వం, సమాన అవకాశాల కోసం మనం ఈ రోజుకూ పాటు పడుతున్నామంటే మనం వెనుకబడి ఉన్నట్టే లెక్క అన్నారు. పార్లమెంటులో మహిళా బిల్లును పాస్ కాకుండా అనేక శక్తులు కుట్రలు చేసి అడ్డుకున్నాయన్నారు. బిల్లు పాస్ అయితే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీ మహిళలకు ఎనిమిది సీట్లు ఇస్తే మరో పార్టీ పది సీట్లు ఇచ్చిందని, మొత్తంగా అసెంబ్లీలో ఎనిమిది మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారని కవిత తెలిపారు. బసవేశ్వరుడి నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తి పొందారని, బసవేశ్వరుడి స్ఫూర్తితో తాము ఏర్పాటు చేయబోయే రాజకీయ సామాజిక న్యాయం కోసం పని చేస్తుందని వివరించారు. 33 శాతం టికెట్లు, పార్టీ పదవులు మహిళలకు ఇస్తామని చెప్పారు.