జాగృతిలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే
అనుచరులతో కలిసి జాగృతి కండువా కప్పుకున్న రాథోడ్ బాపూరావు

(తెలంగాణ జాగృతి కార్యాలయం – బంజారాహిల్స్)

తెలంగాణ రాష్ట్రం కోసం ఏ స్పిరిట్ తో ఉద్యమంలో కలిసి పని చేశామో ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం అదే పట్టుదలతో ఉద్యమకారులు ఒక్కటిగా కలిసి పని చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. బూర్జువా పార్టీలను వదిలి కొత్త పార్టీలోకి రావాలని కోరారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే(బోథ్) రాథోడ్ బాబూరావు తన అనుచరులతో కలిసి ఆదివారం కవిత సమక్షంలో జాగృతిలో చేరారు. బంజారాహిల్స్ లోని జాగృతి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనకు కండువా కప్పి ఆహ్వానించిన కవిత మాట్లాడుతూ..అనేక జిల్లాల నుంచి కొత్త పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 2006లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తాను కుటుంబంతో పాటు వారం రోజులు ఉండి హెల్త్ క్యాంపు నిర్వహించానని గుర్తు చేశారు.
రాథోడ్ బాపూరావు ఉద్యోగాన్ని వదులుకుని తెలంగాణ ఉద్యమంలో పని చేశారని చెప్పారు. జాగృతి ద్వారానే రాథోడ్ బాపూరావు బిఆర్ఎస్ లో చేరారని, రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారని తెలిపారు. తెలంగాణలో ఉన్న ఉద్యమ కారులు కొత్త పార్టీ వైపు చూస్తున్నారని వివరించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్త పార్టీకి ఆదరణ ఉంటుందని చెప్పారు.

కవిత సీఎం కావాలి

తెలంగాణ జాగృతిలో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మంచి రోజులు వస్తాయని ఉద్యోగానికి రాజీనామా చేసి బోథ్ నియోజకవర్గంలో పని చేశానని వెల్లడించారు. అడవుల జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో కవిత వారం రోజుల పాటు మెడికల్ క్యాంపు పెట్టారని గుర్తు చేశారు. ఆమె ఇచ్చిన ధైర్యంతోనే తాను ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చానని వివరించారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, మధ్యలో వచ్చిన వాళ్ళు మంత్రులు అయ్యారని చెప్పారు. మూడవ సారి తనకు టిక్కెట్ ఇవ్వలేదన్నారు.
కవిత నాయకత్వంలో కొత్త పార్టీలో చేరబోతున్నానని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి కవిత కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరినా తనకు ప్రాధాన్యత దక్కలేదన్నారు. కొత్త పార్టీ ప్రకటించిన తర్వాత ఇచ్చోడలో పెద్ద సభ ఏర్పాటు చేసి కార్యకర్తలను పార్టీలో జాయిన్ చేయిస్తానని బాపూరావు వెల్లడించారు.
ఇదే వేదిక మీద సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పలువురు తెలంగాణ జాగృతిలో చేరారు.