గద్వాల్ వాసులతో చాయ్ పే చర్చ | (గద్వాల)
ప్రస్తుత పాలిటిక్స్ తీరు మారాలని, రాజకీయ నాయకులు సేవ చేయకపోతే యువత, మహిళలు ప్రశ్నించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకు జాగృతి ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు. గద్వాల పట్టణంలోని దౌలత్ హోటల్ లో స్థానికులతో కలిసి చాయ్ తాగి పట్టణ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు కవిత.
“స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు అయిన సరే గద్వాల్ లో అక్షరాస్యత పెరగలేదు. చైల్డ్ లేబర్ కూడా ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఈ విషయం నన్ను చాలా బాధపెడుతున్నది. పరిస్థితి ఇలా ఎందుకు ఉందన్నది మన అందరం విశ్లేషణ చేసుకోవాలి. ఇక వైద్య సేవల కోసం చాలా మంది కర్నూల్ వెళ్తున్నారు. అక్కడ ఆరోగ్యశ్రీ వర్తించదు. ప్రభుత్వం అక్కడ కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేసే ప్రయత్నం చేయాలి. వందల ఏళ్లుగా తెలంగాణ, తెలుగు ఉనికి చాటిన గద్వాల్ చదువులో వెనుకబడి ఉండటం దారుణం. ఇక్కడ ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ కూడా లేదు.
ఈ అన్ని అంశాలపై జాగృతి చిత్తశుద్ధితో పనిచేస్తుంది.
గద్వాల్, ఆలంపూర్ లో రోడ్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఇసుక మాఫియా కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయని చెబుతున్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు అయిన సరే పరిస్థితి ఇలా ఉందంటే మార్పు రావాల్సిన అవసరముంది. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. “











