పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన రైతులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి సమావేశమయ్యారు.
ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా స్థానిక రైతులతో కలిసి ఉద్యమిస్తానని హామీ ఇచ్చారు.
ఏదో మతలబు ఉంది
“ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ 12 గ్రామాల రైతులు ఆందోళన చేస్తున్నారు. మీ ఆందోళనకు నేను సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నా. ప్రభుత్వం అనుమతించినా రైతులు ఎందుకు గొడవ చేస్తున్నారని ఇక్కడకు రాకముందు అనుకున్నా. కానీ ఆర్డీఎస్ కెనాల్, పచ్చని పంట పొలాల వద్ద అనుమతిచ్చారు. అంటే ఇందుకు మనం సమ్మతిస్తే భవిష్యత్ లో ఫ్యాక్టరీ వ్యర్థాలను కెనాల్ లోకి వదులుతారు.
ఇక్కడ భూములను మీ అందరినీ మోసం చేసి కొన్నారంటేనే ఇక్కడ ఏదో మతలబు ఉంది. ఈ ఫ్యాక్టరీకి బీఆర్ఎస్ అనుమతిచ్చినా, కాంగ్రెస్ అనుమతిచ్చినా తప్పు తప్పే అవుతుంది. ఈ ఫ్యాక్టరీ రద్దు అయ్యే వరకు కూడా మీతో పాటు నేను కూడా ఫైట్ చేస్తా. అసలు ఇక్కడి సైట్, పొలాలు, కాల్వ చూడకుండా ఏ విధంగా అధికారులు అనుమతిచ్చారు? ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతించవద్దు. ఈ భూములు కాపాడుకోవటానికి ఆందోళన చేస్తే మీ మీదనే లాఠీ ఛార్జ్ చేస్తారా? ప్రభుత్వానికి ఎంత బలుపు? ఎంత అధికార మదం? నిజంగా ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే ముందు రైతులతో మాట్లాడి వాళ్లను ఒప్పించాలి కదా? పోలీసుల జులుంతో ఆపుతామంటే కుదరదు. ఇది ఎడ్డి, గుడ్డి తెలంగాణ కాదు. ఉద్యమం చేసి తెలంగాణనే సాధించుకున్నాం. ఈ కంపెనీని రద్దు చేయించటం పెద్ద విషయమేమీ కాదు. కృష్ణానది పక్కన నారాయణ్ పేట వద్ద కూడా ఇలాగే ఫ్యాక్టరీకి ప్రయత్నం చేస్తున్నారు. నేను కంపెనీలు రావద్దని చెప్పటం లేదు. కానీ పచ్చని పంట పొలాల వద్ద వాటికి అనుమతి ఎలా ఇస్తారు? “
సీఎంకు గద్వాల్ గోస పట్టదు
“రెడ్ జోన్ మార్క్ వద్ద కంపెనీలకు పర్మిషన్లు ఇవ్వండి. మాకు అభ్యంతరం లేదు. ఈ ప్రాంతంలో రోడ్లు చూస్తే కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. మొత్తం ఇసుక దోపిడీకి అలవాటు పడి టిప్పర్లను విపరీతంగా తిప్పుతున్నారు. దీంతో రోడ్లన్నీ గుంతలు గా మారి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. రోడ్ల విషయంలో కచ్చితంగా ఇక్కడి పెద్ద నాయకులను నిలదీద్దాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సీఎం సొంత జిల్లా. కానీ ఆయనకు గద్వాల్, ఆలంపూర్ ప్రజల గోస పట్టటం లేదు. మీరు పోరాటం చేస్తుంటే మీపై కేసులు పెట్టారు. మంచి లాయర్లను పెట్టి ఆ కేసులపై ఫైట్ చేస్తాం. మక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు. దీని పై కలెక్టర్ తో మాట్లాడాం. ఒకటి, రెండు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుంది. ఎక్కడి సమస్యను అక్కడ తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. అధికారులు, ప్రభుత్వంలో కదలిక వచ్చేలా జాగృతి పోరాటం చేస్తోంది. ఎన్నికలప్పుడు మాత్రమే కాదు…నిరంతరం నాయకులు ప్రజల్లో ఉండాలని నమ్మే వ్యక్తిని నేను. అందుకే గ్రామాల్లో ఎన్నికలు ఉంటే మేము హైదరాబాద్ లో జనం బాట చేశాం. ఓట్లు లేనప్పుడు కూడా నాయకులు ప్రజల్లో ఉండేలా అలవాటు చేయాలి. ఇప్పుడు నేను బీఆర్ఎస్ లో లేను. ఆ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేశారు. 20 ఏళ్లుగా జాగృతి సంస్థ తరఫున ప్రజల కోసం పోరాటం చేస్తున్నా. బతుకమ్మ, బోనాలు ఎత్తుకొని ఉద్యమంలో పోరాటం చేస్తూ ప్రజల మధ్యలో ఉన్నా. ఇక ముందు కూడా నేను ప్రజల కోసమే నిత్యం పోరాటం చేస్తానని చెబుతున్నా. గతంలో మనకు ఆంధ్రా పాలకుడు చంద్రబాబుతో సమస్య ఉండేది. అప్పుడు నీళ్లు వాళ్లకు ముంపు మనకు అన్నట్లుగా వ్యవహరించేవారు. ఇప్పుడు ఆంధ్రా పాలకుడి శిష్యుడు అధికారంలోకి వచ్చారు. మళ్లీ కర్నూల్ లో ప్రాజెక్ట్ కోసం మన వద్ద భూమి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అందుకు అంగీకరించవద్దు. గుండ్రెవుల ప్రాజెక్ట్, ఇథనాల్ ప్రాజెక్ట్ రద్దయ్యే వరకు మీతో పోరాటం చేస్తా.”

















