సీడ్ కంపెనీ సందర్శన | (గద్వాల)

పత్తి రైతులతో కంపెనీలు నేరుగా ఒప్పందాలు చేసుకోక పోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనంబాటలో భాగంగా ఆదివారం అయిజలోని సీడ్ కాటన్ జిన్నింగ్ మిల్ పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.  

బకాయిలు చెల్లించండి

” పెద్ద కంపెనీలు మనకు  విత్తన పత్తి చేయటం అలవాటు చేశాయి. కానీ ఆ కంపెనీలు రైతుకు ఇస్తున్న దానికన్నా మూడింతలు ఎక్కువగా బయట అమ్ముకుంటున్నాయి. 

రైతులతో కంపెనీలు డైరెక్ట్ గా అగ్రిమెంట్ చేసుకోవటం లేదు. 

ఇలా జరుగుతున్న చూస్తూ ఊరుకోవటం అన్ని ప్రభుత్వాలు చేసిన తప్పే. దాదాపు 30 ఏళ్లుగా లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా ఇలా చేస్తున్నారు. ఆర్గనైజర్ల వ్యవస్థ తీసుకొచ్చి ఇన్నాళ్లు రైతులను మోసం చేశారు. 

ఇప్పుడు ఆర్గనైజర్లు కూడా చేతులు ఎత్తేశారు. 550 ఇవ్వాల్సినది 450 అంటున్నారు. రైతులతో కంపెనీలు అగ్రిమెంట్ చేసుకుంటే మనం అడగటానికి ఉంటుంది. 

రైతు కమిషన్ కూడా ఎందుకు విత్తన కంపెనీలను ఈ విషయంపై ప్రశ్నించటం లేదు. అన్ని రేట్లు పెరుగుతుంటే రైతులు పండించిన వాటికి మాత్రం రేటు ఎందుకు తగ్గుతోంది. గతంలో రైతులు, ఆర్గనైజర్లు, కంపెనీల మధ్యలో ఒప్పందం కోసం ప్రయత్నం జరిగినప్పటికీ అది సాధ్యం కాలేదు. సీడ్ ఇచ్చే కంపెనీలతో ఒప్పందం ఉండాలని మేము పోరాటం చేస్తాం. అప్పుడు మాత్రమే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం అడగటానికి ఉంటుంది. ఇప్పుడు రూ. 2 వేల కోట్ల వరకు రైతులకు కంపెనీలు బకాయిలు పెట్టాయి. సీడ్ కంపెనీలతో రైతులకు ఒప్పందం ఉండే విధంగా ప్రభుత్వమే పాలసీ చేయాలి. 

ఇక కేంద్రం కొత్తగా తేనున్న చట్టం ప్రమాదకరంగానే మారే పరిస్థితి ఉంది. అప్పుడు సీడ్ కంపెనీలు మోసం చేస్తే ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. 

అందుకే మనం కేంద్రం తెచ్చే బిల్లు తో సహా ఇక్కడి రైతులకు నష్టం జరగకుండా పోరాటం చేద్దాం. రైతులకు 550 ఇవ్వాల్సిన చోట 450, 410 అంటున్నారు. దాని మీద రైతులు కంపెనీలను అడగాలి. మేము కూడా మీ తరఫున పోరాటం చేస్తాం. రైతు కమిషన్ వద్దకు, సీఎం వరకు వెళ్తాం. 

ముఖ్యంగా కేంద్రం తెచ్చే బిల్లు, రైతులకు కంపెనీలతో అగ్రిమెంట్ చేసేలా ఫైట్ చేద్దాం.”