ఎస్సీ ఉప కులాల హక్కుల సాధన కోసం ఉద్యమిస్తా
అన్ని ఉప కులాలకు తహశీల్దార్లు క్యాస్ట్ సర్టిఫికేట్లు జారీ చేయాలి
గురుకులాల్లో ప్రవేశ పరీక్షతో సంబంధం లేకుండా ఉప కులాల విద్యార్థులకు సీట్లు ఇవ్వాలి
లిడ్ క్యాప్ భూముల్లో దళిత పారిశ్రామికవేత్తలతో పరిశ్రమలు ఏర్పాటు చేయించాలి
-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
(తెలంగాణ రక్షణ సేన కారియాలయం, హైదరాబాద్) :
ఎస్సీ ఉప కులాల హక్కుల సాధన కోసం ఉద్యమిస్తానని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. సోమవారం బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఎస్సీ 57 ఉప కులాల నాయకులతో సమావేశమయ్యారు. ఎస్సీల్లో 57 ఉప కులాలు ఉంటే అందులో 47 కులాలకు ఆర్డీవోలు క్యాస్ట్ సర్టిఫికెట్లు జారీ చేయడం అత్యంత విచారకరమన్నారు. అన్ని కులాలకు తహశీల్దార్లే క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. సమాజంలో అత్యంత వెనుకబడిన ఎస్సీ ఉప కులాల్లోని విద్యార్థులకు ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా గురుకులాల్లో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధుల్లోనూ ఉప కులాలకు ప్రత్యేక వాటా ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు.
ఎస్సీ ఉప కులాల్లోని కళాకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి పెన్షన్ లు ఇవ్వాలని కోరారు. గచ్చిబౌలిలోని లిడ్ క్యాప్ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం బడాబాబులకు కట్టబెట్టాలని చూస్తోందని.. ఆ భూములను రక్షిస్తామన్నారు. జిల్లాల్లోని లిడ్ క్యాప్ భూములు రక్షించేందుకు ఉద్యమిస్తామన్నారు. గ్రామ దేవతల ఆలయాల్లో దళిత పూజారులకు అవకాశం ఇవ్వాలని, గ్రామ దేవతల ఆలయాలకు ధూపదీప నైవేథ్యాల కోసం ప్రోత్సాహకాలు అందజేయాలన్నారు. అనేక ఉప కులాల పేర్లు తప్పుగా గెజిట్ లో పేర్కొన్నారని, వాటిని సవరించే వరకు ప్రభుత్వం వెంట పడుతామన్నారు. ఎస్సీ ఉప కులాల హక్కుల సాధన కోసం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఆందోళన చేస్తామని తెలిపారు. సమావేశంలో ఎస్సీ 57 ఉప కులాల ఐక్య వేదిక అధ్యక్షుడు చింతల రాజలింగం, టీఆర్ఎస్ నాయకులు రూప్ సింగ్, ఆనందం, 57 ఉప కులాల నాయకులు పాల్గొన్నారు.








