మహిళలను వంచించిన బీజేపీ
డీలిమిటేషన్ బిల్లుతో మహిళా బిల్లును కలపడంతోనే లోక్ సభలో వీగిపోయింది
2027 సెన్సెస్ లో ఓబీసీలను లెక్కించి ఆ లెక్కల ఆధారంగా మహిళా రిజర్వేషన్లు కల్పించాలి
-తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
(హైదరాబాద్)
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని మరోసారి నిరూపితం అయ్యిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
ప్రతిపక్షాలు అడ్డుకుంటాయనే స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ బీజేపీ కుట్ర పూరితంగా రెండు బిల్లులను కలిపి పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చిందని ఆరోపించారు. మహిళా కోటా బిల్లుతో డీ లిమిటేషన్ బిల్లును ముడి పెట్టడంతో ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి లోక్ సభలో బిల్లు వీగిపోయేలా చేశాయని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ఈ ప్రయత్నం చేసిందని విమర్శించారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభమప్పుడే మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టి పాస్ చేసి దానిని సెన్సెస్ కు లింక్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు 2011 సెన్సెస్ అధారంగా మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశ పెడుతున్నట్టు చెప్పి మరోసారి వంచించిందని కవిత ఆరోపించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఆడబిడ్డలు బీజేపీ మోసాన్ని గుర్తించాలని చెప్పారు. పశ్చిమ బెంగాల్ లో ఒక మహిళ నాయకత్వం వహిస్తోంది.. ఈ మోసకారి బీజేపీని ఓడించి ఆ మహిళను గెలిపించాలని బెంగాల్ లో ఉన్న మీ ఫ్రెండ్స్ కు చెప్పండని కవిత పిలుపునిచ్చారు.








