పాలమూరులో కోసం పాదయాత్ర చేస్తా

-టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

తెలంగాణకు జలద్రోహం చేస్తున్న కాంగ్రెస్ ను కిలోమీటర్ లోతున బొంద పెడుతం

నీళ్ల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిన ద్రోహానికి ప్రజలు వాళ్లను క్షమించరు

పదేళ్లు అధికారంలో ఉన్న మన బీఆర్ఎస్ పాలకులే మనకు అన్యాయం చేశారు

దసరా నాటికి పాలమూరు-రంగారెడ్డి పనులను ప్రభుత్వం ప్రారంభించాలి

(చౌదరిగూడెం – షాద్ నగర్)

తెలంగాణకు నీటి విషయంలో జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకే తెలంగాణ రక్షణ సేన పుట్టిందని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కోసం ఉద్యమిస్తామని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత చెప్పారు. షాద్ నగర్ సమీపంలోని చౌదరిగూడెం లక్ష్మీదేవిపల్లిలో శుక్రవారం నిర్వహించిన పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభలో కవిత మాట్లాడారు. వచ్చే దసరా నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేయకపోతే ఈ ప్రాంతమంతా పాదయాత్ర నిర్వహిస్తానని ప్రకటించారు.

రూ. 33 వేల కోట్లు ఖర్చు చేసినా..

“తెలంగాణ రక్షణ సేన ఏర్పడిన తర్వాత మొదటి సారిగా మహబూబ్ నగర్ జిల్లాలో సభ పెట్టుకోవటం సంతోషం. 

నేను జోగులాంబ అమ్మవారి భక్తురాలిని. మొదటి మీటింగ్ ఇక్కడే పెడతామని గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరు పిడికిలి బిగించినా సరే ప్రజలు మద్దతిచ్చి వారిని గెలిపించారు. ఆ పోరాటాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. అలాగే తెలంగాణ రక్షణ సేన నుంచి నీటి ఉద్యమాన్ని చేపడుతున్నాం. 

Kavitha launches water rights stir over Palamuru-Rangareddy project delays in Telangana

తెలంగాణ చరిత్రలో ఇది రాసిపెట్టుకోవాల్సిన రోజు. 

నీళ్ల కోసమే మనం తెలంగాణ పోరాటం చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. పల్లె పల్లెన పల్లెరు కాయలు మొలిసినయంటూ గతంలో మనం ఆవేదన చెందాం. 

మహబూబ్ నగర్ జిల్లా నుంచి కృష్ణానది 300 కిలోమీటర్లు పారుతున్నా సరే మనకు నీళ్లు రాని పరిస్థితి. బిర బిరా కృష్ణమ్మ నీళ్లన్నీ కూడా ఆంధ్రాకే వెళ్లిపోయాయి. తెలంగాణ తెచ్చుకున్నాక 12 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క ఎకరాకు కూడా నీళ్లు రాలేదు. భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను కూడా మనం పూర్తి చేసుకోలేదు. పాలమూరుకు కృష్ణానది నుంచి రావల్సిన నీళ్లు రాలేదు. 

బీఆర్ఎస్ పదేళ్లు, కాంగ్రెస్ వచ్చి రెండున్నరేళ్లు గడచినా కృష్ణా నీళ్లు మనకు రాలేదు. పాలమూరు-రంగారెడ్డి కోసం 33 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి 33 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు. ఆంధ్రావాళ్లు ఉన్నప్పుడు మనకు నీళ్లు రాకుండా చేస్తున్నారని మనం తిట్టుకున్నాం. కానీ అవసరానికి ఆంధ్రావాళ్లను తిట్టి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ కూడా మనకు చుక్క నీళ్లు తేలేదు. “

మనవాళ్లే మోసం చేశారు

“పాలమూరు అంటే మేధావులు, కళాకారులు ఉంటారు. మీరంతా ఒక్కసారి ఆలోచించాలి. మన పాలకులే మనల్ని మోసం చేశారు. ఇది నిజమా అంటే అక్షరాల నిజం. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి జురాల నుంచి నీళ్లు తీసుకునేందుకు జీవో 72 తెచ్చారు. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భేషజాలకు పోయింది. జూరాల సోర్స్ పాయింట్ ను శ్రీశైలంకు మార్చింది. బీఆర్ఎస్ పార్టీ చేసింది క్షమించరాని నేరం. ఆ తర్వాత నీళ్లు తీసుకునే ఎత్తును కూడా పెంచారు. బీఆర్ఎస్ లో ఉన్న ఒక గుంటనక్క కాంట్రాక్టర్ తో కుమ్మక్కై నీళ్లు తీసుకునే ఎత్తును పెంచారు. అప్రోచ్ ఛానెల్ 140 మీటర్లు ఉండాల్సింది. కానీ దాన్ని 50 మీటర్లకు కుదించారు. రిజర్వాయర్లు కట్టారు. కానీ అవసరమైన చిన్న కాలువలు మాత్రం కట్టలేదు. శ్రీశైలంకు సోర్స్ పాయింట్ మార్చటంతో మనకు రోజూ ఆంధ్రావాళ్లతో పంచాయితీ అవుతున్నది. ఇప్పుడు మనం మీటింగ్ పెట్టుకున్న లక్ష్మిదేవిపల్లిలోని చౌదరిగూడెం తెలంగాణలోనే ఎత్తైన ప్రదేశం. ఇక్కడ రిజర్వాయర్ కడితే రంగారెడ్డి జిల్లాకు 4 లక్షలు, మహబూబ్ నగర్ జిల్లాకు 7 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వవచ్చు. కానీ బీఆర్ఎస్ చేసిన తప్పునే ఇప్పుడు కాంగ్రెస్ కొనసాగిస్తున్నది. రిజర్వాయర్లు కట్టి కమిషన్లు దండుకున్నారే తప్ప చుక్క నీళ్లు తేలేదు. “

Kavitha launches water rights stir over Palamuru-Rangareddy project delays in Telangana.

మేము కట్టి తీరుతం

“తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వం కచ్చితంగా అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఇదే ప్రాంతంలో ప్రాజెక్టు కడుతామని మీకు మాట ఇస్తున్నా. మాట్లాడితే నల్లమల పులిబిడ్డను అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు. పాలమూరు బిడ్డలు కాంగ్రెస్ కు 12 సీట్లు ఇస్తే ఇప్పటి వరకు కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తి పోయలేదు. పాలమూరుకు మీరు చేస్తున్న ద్రోహానికి ప్రజలు మీ కాంగ్రెస్ పార్టీని కిలోమీటర్ లోతులో బొందపెడతారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్, ఇప్పుడున్న కాంగ్రెస్ కూడా దీనికి బాధ్యత తీసుకోకపోతే ఎవరికీ చెప్పుకోవాలి? చుక్క నీళ్లు ఇవ్వకుండా మోటార్లు, పంపులు అంటూ 6 వేల కోట్లు ఖర్చు చేశారు. కక్కుర్తితో కమీషన్లు తిని ప్రజలకు అన్యాయం చేశారు. ఈ పాపంలో జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికి భాగం ఉంది. దసరా వరకు మీకు టైమ్ ఇస్తున్నాం. లక్ష్మిదేవిపల్లిలో రిజర్వాయర్ కట్టాల్సిందే. లేదంటే దసరా తెల్లారి నుంచే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేస్తాం. నేను చేసిన విమర్శలతో రేపటి నుంచి గులాబీ దండు నాపై ఆటాక్ చేస్తారు. కానీ మనం ఒక్కసారి ఆలోచించాలి. తెలంగాణలో పదేళ్లు అధికారం చెలాయించి చాలా జిల్లాల్లో ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదు. ఆదిలాబాద్ లో తుమ్మిడి హెట్టి, వార్దా కడుతామని చెప్పి అది కట్టలేదు. 

నిజామాబాద్ లో కొత్తగా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు. కరీంనగర్ లో ఎల్లంపల్లి, మిడ్ మానేరు వంటి ప్రాజెక్టులకు ఆయకట్టు స్థిరీకరణ  మాత్రమే చేశారు. 

ఒక్క మెదక్ జిల్లాలో మాత్రమే లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. వరంగల్ లో కనీసం ఒక్క కొత్త ప్రాజెక్ట్ కట్టలేదు. 25 ఏళ్లుగా దేవాదుల కూడా పూర్తి చేస్తలేరు. నల్గొండలో ఒక్క కొత్త రిజర్వాయర్ లేదు. “

వాటర్ కమిషన్ నియమిస్తాం

“దిండికి నీళ్లు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేదు. నల్గొండ జిల్లాకు నీళ్లు ఇచ్చేందుకు పాలమూరు-రంగారెడ్డిని లింక్ చేస్తున్నారు. ఇవ్వాళ పేపర్లో వార్త చూస్తే బాధనిపించింది. కృష్ణాలో ఆంధ్రావాళ్లు 770 టీఎంసీలు వాడుకున్నారు. మనం 221 టీఎంసీలు మాత్రమే వాడుకున్నాం. మన దగ్గర పారుతున్న కృష్ణానది నీళ్లు ఆంధ్రాకు తరలిపోతున్నాయి. వాళ్లను మనం అనాల్సిందేమీ లేదు. తెలివిగా డ్యామ్ లు, చెక్ డ్యామ్ లు కట్టుకున్నారు. వాళ్ల ప్రజలకు మేలు చేసేందుకు అవినీతి చేయకుండా పనులు చేసుకున్నారు. బీఆర్ఎస్ కు పదేళ్లు ప్రజలు ఇచ్చిన అవకాశం పొగొట్టుకుంది. కాంగ్రెస్ రెండున్నరేళ్లు గడిచినా బుద్ది తెచ్చుకోవటం లేదు. కొడంగల్-నారాయణ పేట్-మక్తల్ పూర్తి చేస్తానని ముఖ్యమంత్రి అంటున్నాడు. రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే దాన్ని లక్ష ఎకరాలకు కుదించారు. అసలు ముఖ్యమంత్రి మొత్తం పాలమూరును కదా ముందు పూర్తి చేయాలి. కానీ అది చేయటం లేదు. నీటి విషయంలో జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకే తెలంగాణ రక్షణ సేన పుట్టింది. మేము అధికారంలోకి వచ్చాక జురాలను సోర్స్ గా తీసుకొని 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం. జురాలలో వరద నీళ్లు ఉంటాయి. ఎంత దమ్ముంటే అంత ఎత్తి పోసుకోవచ్చు. పేరుకు 2 టీఎంసీలే అంటారు.. కానీ మనం ఐదు టీఎంసీలను 35 రోజుల పాటు ఎత్తిపోసుకోవచ్చు. చేసే అవకాశం మనకు ఉన్నప్పటికీ పాలకులకు ఆ మనసు లేదు. ఇప్పుడు చెరువులు నింపి వదిలేస్తున్నారు. నిండిన చెరువులను పర్యవేక్షించేందుకు లష్కర్ లను నియమిస్తాం. 

వాళ్లు చెరువుల నుంచి నీళ్లు పొలాల వద్దకే వెళ్లే వరకు పర్యవేక్షిస్తారు. వాటర్ కమీషన్ ను కూడా నియమిస్తాం. ఇరిగేషన్, వాటర్ మేనేజ్ మెంట్ ను వాటర్ కమిషనే చూసుకుంటుంది. మీకు ప్రమాణం చేసి నేను మాట ఇస్తున్నా. నీళ్ల కోసం చేస్తున్న ఉద్యమానికి మాకు మద్దతివ్వండి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాల్సిన బీజేపీ కూడా మోసం చేస్తున్నది. 

ఇక్కడి ఎంపీ అరుణమ్మ 10వ తారీఖున ఇక్కడకు వస్తున్న మోడీని అడిగి మనకు జాతీయ హోదా తేవాలి. జాతీయ హోదాతో పాటు, జనగణనలో బీసీ కాలమ్ ఉండాలి.. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బీసీ బిల్లుకు ఆమోదం తెలుపాలని ప్రధాని మోడీని డిమాండ్ చేస్తున్నా.”