బంజారాహిల్స్ – తెలంగాణ జాగృతి కార్యాలయం
దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన వడ్డెర ఓబన్న చిరస్మరణీయుడని తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ లఖావత్ రూప్ సింగ్ అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి చరిత్ర మనకు మూడేళ్ల క్రితం ఓ సినిమా ద్వారా తెలిసిందని చెప్పారు. ఓబన్న 219వ జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో ఆదివారం నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ..స్వాతంత్ర్య పోరాటంలో తన పరాక్రమంతో వడ్డెరలకు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎంతో గౌరవం తెచ్చిన మహనీయులు ఓబన్న అని కొనియాడారు. అలాంటి వ్యక్తి గురించి ఎన్నో ఏళ్లుగా తెలియకపోవటాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ సమాజం బాధపడుతోందని చెప్పారు. చరిత్రలో ఎన్నో గొప్ప ఘట్టాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు ప్రాణాలు అర్పించారని వివరించారు. కానీ వారి చరిత్ర మనకు తెలియకుండా పోవటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రకులాలకు చెందిన చరిత్రకారులు మిగతా వర్గాల చరిత్రను పుస్తకాలకు ఎక్కించలేదని విమర్శించారు. ఎంతో మంది గొప్ప నాయకులు మరుగున పడిపోయారని, వారి చరిత్ర తెలియాల్సి ఉందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలలో ఉన్న మేధావులు ఆయా వర్గాల్లోని గొప్ప నాయకుల చరిత్రను వెలికితీయాలని కోరారు.
తద్వారానే మన ఐక్యత, ఉనికిని చాటుకోగలమని రూప్ సింగ్ అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు చిన్న కులాలను ఎప్పుడూ ఆదరించలేదని ఆరోపించారు. జాగృతి నాయకురాలు కవితమ్మ మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. అన్ని కులాల ఆదిమ పురుషులను గౌరవించుకునే అవకాశం కవితమ్మ కల్పిస్తున్నారని తెలిపారు. ఆమె ఆధ్వర్యంలో మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.

వడ్డెర ఓబన్న 219 వ జయంతి సందర్భంగా ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకోవటం సంతోషకరమని జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి అన్నారు. ప్రతి వర్గంలో ఉన్న గొప్పవాళ్ల చరిత్రను బయటకు తీసుకురావాల్సిన సందర్భమిదన్నారు. ఎస్సీ, ఎస్టీల్లో ఉన్న మహనీయుల చరిత్ర బయటకు వచ్చిందని, కానీ బీసీల్లో ఉన్న అనేక కులాల్లో త్యాగాలు చేసిన గొప్ప నాయకుల చరిత్ర ఎవరికీ తెలియదన్నారు. చరిత్రలో ఏ ఉద్యమం చూసినా సరే ఉరి కొయ్యాల మీది వరకు వెళ్లిన బీసీలు ఉన్నారని తెలిపారు. ఎన్నో యుద్దాల్లో తమ ప్రాణాలు బలి ఇచ్చిన ధ్రువతారులు, వేగుచుక్కలు బీసీలని పేర్కొన్నారు.
కానీ వారి చరిత్ర బయటకు రాని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం మొదలయ్యే నాటి వరకు కూడా సర్వాయి పాపన్న చరిత్ర వెలుగు చూడలేదన్నారు. గ్రామ, గ్రామాన ఎంతో మంది గౌడ్స్ ఉన్నప్పటికీ పాపన్న చరిత్ర తెలియలేదన్నారు.
అందుకే బీసీల్లో ఉన్న మేధావుల్లో ఆయా వర్గాల మేధావుల చరిత్రను బయటకు తేవాలని పిలుపునిచ్చారు. వాళ్లందరిపై లోతైన విశ్లేషణ చేసి వారి త్యాగాలను సమాజానికి తెలియజేయాలని కోరారు.
ఓబన్న లాంటి గొప్ప వ్యక్తి గురించి
ఇటీవల వచ్చిన ఓ సినిమా చూసే వరకు కూడా మనకు తెలియకపోవటం దురదృష్టకరమని బీసీ జాగృతి అధ్యక్షుడు ఎత్తరి మారయ్య అన్నారు. అప్పట్లోనే ఆయన సైన్యాధిపతిగా ఉండటం విశేషమన్నారు. ఆయుధాలు లేని సమయంలో కర్రలతో ఆయుధాలు చేసి దేశాన్ని రక్షించే ప్రయత్నం చేశారని కొనియాడారు. ఓబన్న లాంటి ఎంతో మంది గొప్ప వ్యక్తుల చరిత్ర మనకు తెలియాల్సి ఉందని చెప్పారు. వడ్డెర కులబంధువులు, సంచార జాతుల వాళ్లు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పోరాడాలని పిలుపునిచ్చారు. అదే విధంగా బీసీలకు రాజ్యాధికారం అవకాశాలు కల్పించే వారికి మనం అండగా ఉండాలన్నారు. కవితక్క సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నారని, ఆమెకు మనందరం అండగా ఉంటే…బీసీలకు మంచి అవకాశాలు వస్తాయని చెప్పారు. వడ్డెర కులంలో ఉన్న సంఘాలన్నీ కూడా ఒక్క తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. కవితక్కకు మద్దతుగా మనం ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు వరలక్ష్మి, నాయకులు వీరన్న, వేముల భవాని, ఆనందం, శ్రీకాంత్ గౌడ్, ఎత్తరి గణేష్, వరికుప్పల గంగాధర్, గండికోట కుమార్, కొమ్మరాజుల శేఖర్, రూప మహేశ్వరి, శివరాత్రి వెంకటేష్, బొమ్మిశెట్టి శ్రీనివాస్, అల్లపు శ్రీశైలం, శివరాత్రి లక్పతి తదితరులు పాల్గొన్నారు.








